TG: తెలంగాణలోని అన్ని ఆస్పత్రులను అలర్ట్ చేయండి.. క్యాన్సర్ లక్షణాలు ఉన్న పేషెంట్లను గుర్తించండి

by Gantepaka Srikanth |

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రముఖ క్యాన్సర్ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ గౌరవ సలహాదారులు నోరి దత్తాత్రేయులుతో సమావేశమయ్యారు.

TG: తెలంగాణలోని అన్ని ఆస్పత్రులను అలర్ట్ చేయండి.. క్యాన్సర్ లక్షణాలు ఉన్న పేషెంట్లను గుర్తించండి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రముఖ క్యాన్సర్ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ గౌరవ సలహాదారులు నోరి దత్తాత్రేయులుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నోరి దత్తాత్రేయులు రాష్ట్రంలో క్యాన్సర్ నిర్మూలనపై రూపొందించిన పలు అంశాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ICMR నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2025 సంవత్సరానికి 55 వేల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన పలు అంశాలను మంత్రి దామోదర్ రాజనర్సింహాతో చర్చించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయో వైద్యాధికారులు నోటిఫై చేయాలన్నారు. క్యాన్సర్ బాధితుల డేటాను నమోదు చేసుకోవాలన్నారు. క్యాన్సర్ నివారణపై పరిశోధనలు నిర్వహించాలని సూచించారు.

రాష్ట్రంలో క్యాన్సర్(Cancer Patient) బాధితులకు మెరుగైన వైద్య సాయాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా సేవలను అందించడాన్ని స్వాగతించారు. 90 శాతం క్యాన్సర్ రోగాలను రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సేవలలో కవర్ అవుతున్నాయన్నారు. నిమ్స్, MNJ క్యాన్సర్ అసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలున్నాయన్నారు. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించేందుకు అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాన్సర్ లక్షణాలున్న వారిని గుర్తించిన వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు. క్యాన్సర్ స్క్రీనింగ్‌లో పాజిటివ్ వచ్చిన బాధితులను గుర్తించి వారిని సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే అసుపత్రులకు రిఫర్ చేయాలని సూచించారు.

జిల్లా ప్రభుత్వ అసుపత్రులలో క్యాన్సర్ బాదితుల కోసం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. నిమ్స్‌లో క్యాన్సర్ చికిత్సలను అందిస్తున్న సమాచారం ప్రజలకు తెలిసేలా క్యాన్సర్ అవగాహన సదస్సులను నిర్వహించాలి. క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండేలా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలి. క్యాన్సర్ బాధితుల వైద్యం కోసం ప్రతి 100 కిలోమీటర్ల పరిధిలో చికిత్స అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న పలు సేవలను మంత్రి దామోదర్ రాజనర్సింహా డాక్టర్ నోరి దత్తాత్రేయులకు వివరించారు.

క్యాన్సర్‌పై అవగాహన కోసం వర్క్ షాపులను ప్రతి మెడికల్ కాలేజీలో నిర్వహించాలని మంత్రి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారిని రెగ్యూలర్‌గా క్యాన్సర్ స్ర్కీనింగ్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తొలి దశలో క్యాన్సర్‌ను గుర్తించేందుకు వైద్యశాఖ సిబ్బంది అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Next Story