సాంఘిక సంక్షేమ గురుకులాలపై మంత్రి ‘అడ్లూరి’ సమీక్ష

by Muthe.Rajitha |

త్వరలో క్షేత్రస్థాయిలో గురుకులాలను సందర్శించి అక్కడ సమస్యలను తెలుసుకుంటానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

సాంఘిక సంక్షేమ గురుకులాలపై మంత్రి ‘అడ్లూరి’ సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలో క్షేత్రస్థాయిలో గురుకులాలను సందర్శించి అక్కడ సమస్యలను తెలుసుకుంటానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సచివాలయంలో గురువారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చేపడుతున్న పలు వినూత్న కార్యక్రమాలను, గురుకుల కార్యదర్శి డాక్టర్ వి.ఎస్ అలగు వర్షిని మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు. ఎస్సీ గురుకులాల్లో నూతన హాస్టల్ భవనాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలం ఉన్నందున పాత బిల్డింగ్ లో ఏవైనా మరమ్మత్తులు ఉంటే వెంటనే చేపట్టి, వర్షం వల్ల విద్యార్థులకు ఇబ్బందులకు కలగకుండా చూడాలని చెప్పారు. అడ్మిషన్ల ప్రక్రియలో పూర్తిగా పారదర్శకతో వ్యవహరించాలని ఆదేశించారు. గురుకుల విద్యాలయాల పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలపై అధికారులు పలు సూచనలు చేశారు.

ప్రీమియర్ సీఓఈ, కామన్ సీఓఈలలో విద్యార్థుల ఎంపిక ఎలా జరుగుతుందని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి వివరిస్తూ రాష్ట్రంలో మొత్తం 30 సీఓఈలు ఉన్నాయని అందులో టాప్ లో ఐదు ప్రీమియర్ సీఓఈలు ఉన్నాయని, వాటిని ఇప్పుడు 9కి పెంచామని చెప్పారు. ప్రీమియర్ సీఓఈలలో 90 % ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. అలాగే 75% ఉన్నవారికి జనరల్ సీఓఈ లలో అవకాశం ఇచ్చామని ఆమె మంత్రికి వివరించారు.

సీఓపీ(స్టాండర్డ్ ఆఫ్ ప్రోటోకాల్) ఎలా పాటిస్తున్నారని మంత్రి ఆరా తీశారు. వసతి గృహాల తనిఖీల్లో ఇక నుండి ఎస్ఓపీ అమలు ఎలా? జరుగుతుందో పరిశీలిస్తానని చెప్పారు. ఎస్సీ గురుకులాల పక్కా భవనల నిర్మాణానికి ఒక్కో వసతి గృహానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇందుకుగాను ఎస్సీ గురుకులాలకు స్థలం కూడా అందుబాటులో ఉందని నిర్మాణం చేపట్టడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని కార్యదర్శి మంత్రికి వివరించారు.

ఏసిటీల ఆందోళనపై ఆరా!

గురుకులల్లో ఇన్స్టిట్యూషనల్ కేర్ టేకర్(ఐసీటీ)సిబ్బంది చేస్తున్న ఆందోళన పై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా కార్యదర్శి వివరిస్తూ వీరి నియామకానికి సంబంధించి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదని ఇంతకాలం ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా కొనసాగించారని చెప్పారు. హాస్టల్లో ఉన్నటువంటి రెగ్యులర్ స్టాఫ్ టీచర్లు ఇప్పుడు హాస్టల్ వార్డెన్ గా బాధ్యతలు చేపడుతున్నందున వీరి అవసరం తెలిపారు. ముఖ్యంగా వీరి నియామకానికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన కానీ అనుమతి కానీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఐసీటీ నిర్వాహకం వల్ల విద్యార్థులకు అందించే పలు రకాలైన వస్తువులకు సంబంధించి కాంట్రాక్టర్ తో కుమ్మక్కు విద్యార్థులకు సరైన పోషణకు సంబంధించిన వస్తువులు పదార్థాలు విషయంలో కూడా అవకతవకలు జరిగాయనే విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి రావడంతో మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వసతి గృహాలకు సరఫరా చేసే ఏ కాంట్రాక్టర్ అయినా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవలసిన అవసరం లేదని, పూర్తి నాణ్యత కలిగిన వాటిని మాత్రమే సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కు సంబంధించి రేషనలైజేషన్ ప్రక్రియను చెప్పటాల్సిన అవసరం ఉందని కార్యదర్శి వివరించారు. రాష్ట్రంలో నూతన పారామెడికల్ కళాశాల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. గురుకులాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వంటి సిబ్బందికి ప్రతినెల వేతనాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. గురుకుల లో ఇంకా చేపట్టాల్సిన ప్రాధాన్యత అంశాలుగా చేపట్టాల్సిన ముఖ్యమైన పనులు, కార్యక్రమాలను ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.

Next Story