Adluri: అందెశ్రీ సంతాప సభను ఘనంగా నిర్వహిద్దాం.. మంత్రి అడ్లూరి పిలుపు

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభను ‘రాష్ట్ర గౌరవానికి తగ్గట్టు.. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా నిర్వహించాలి’ అని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

Adluri: అందెశ్రీ సంతాప సభను ఘనంగా నిర్వహిద్దాం.. మంత్రి అడ్లూరి పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభను ‘రాష్ట్ర గౌరవానికి తగ్గట్టు.. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా నిర్వహించాలి’ అని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మంత్రి నివాసంలో కవులు, కళాకారులు, దళిత సంఘాలు, ప్రజా సంస్థలు, ఉద్యోగ సంఘాలతో కలిసి ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి దళితుల పక్షాన నిలిచిన నాయకుడు అని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయం నుంచి కళాకారులకు అధిక గౌరవం దక్కేలా తీసుకున్న చర్యల వరకూ.. సీఎం రేవంత్ దళిత, బహుజన వర్గాల పక్షాన నిలిచిన నాయకుడని మంత్రి గుర్తుచేశారు.

సీఎంకు కృతజ్ఞతగా, దళిత ఐక్యత సందేశంగా అందెశ్రీ సంతాప సభను విజయవంతం చేద్దాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దళితులు ఒక్కటై విజయాన్ని సాధించినట్లు.. ఈ సభలో కూడా సమాజం ఒకే తాటిపైకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కవులు, కళాకారులకు ఇంత గౌరవం ఇచ్చిన సీఎం ఇప్పటివరకు లేరని, అందెశ్రీ అంత్యక్రియల్లో సీఎం స్వయంగా పాల్గొనడం, కళాకారుల పట్ల ప్రభుత్వం చూపుతున్న గౌరవానికి ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతమే కాదు.. తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ గౌరవం అందెశ్రీ రచనల్లో ఉందని, అందెశ్రీ రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు అని మంత్రి తెలిపారు. సంతాప సభను సాంస్కృతిక, సామాజిక ఘట్టంగా, ప్రజలు, కవులు, కళాకారులు, విద్యార్థులు, సంఘాలు అందరూ పాల్గొనే వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు.

సభ రూపకల్పన- మంత్రి పేరుతో ప్రకటించిన ముఖ్య సూచనలు

● అందెశ్రీ సేవలను ప్రతిబింబించే కవిసమ్మేళనం

● సాంస్కృతిక నివాళులు, జానపద-ప్రజా కళారూపాల కార్యక్రమాలు

● అన్ని సంఘాలతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు

● దళిత ఐక్యత, తెలంగాణ స్ఫూర్తి, కళాకారుల గౌరవం అనే మూడు ప్రధాన థీమ్స్ చుట్టూ సభ రూపకల్పన

Next Story