టీజీఐఐసీ భూములకు రికార్డు ధర.. ఎకరం @రూ.237 కోట్లు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-28 15:50:35  IST  )

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీపరిధిలోని సర్వే నంబర్ 83/1 లో చేపట్టిన భూ వేలానికి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది.

టీజీఐఐసీ భూములకు రికార్డు ధర.. ఎకరం @రూ.237 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) రాయదుర్గం నాలెడ్జ్ సిటీ (Knowledge City) పరిధిలోని సర్వే నంబర్ 83/1 లో చేపట్టిన భూ వేలానికి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. 83/1లో 6 ఎకరాల 9 గుంటలకు వేలం వేయగా రికార్డుస్థాయి ధర వచ్చింది. రాయదుర్గంలో ఒక ఎకరం భూమి అక్షరాలా రూ.237 కోట్లు పలికింది. గతేడాది ఇదే ప్రాంతంలో ఒక ఎకరం భూమి ధర రూ.177 కోట్లు పలికింది. వేలంలో భూమిని గౌర వెంచర్స్ దక్కించుకుంది. వేలం వేసిన భూమి మల్టీ-యూజ్ (Multi-use) కేటగిరీ కింద వస్తుంది. అంటే దీనిని కమర్షియల్, రెసిడెన్షియల్, రిటైల్ లేదా హోటల్స్ వంటి ఏ అవసరాలకైనా వాడుకోవచ్చు. మైండ్‌స్పేస్ ఐటీ పార్క్, T-Hub, T-Works, క్వాల్‌కామ్ క్యాంపస్, రాయదుర్గం మెట్రో స్టేషన్‌లకు అత్యంత సమీపంలో ఉండటంతో అక్కడి భూములకు భారీగా గిరాకీ ఏర్పడింది. సౌత్ ఇండియాలోనే ఇదే హయ్యెస్ట్ రేటు అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు.

ఈ సందర్భంగా టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శశాంక్ మాట్లాడుతూ.. రాయదుర్గం ఈ-వేలానికి వచ్చిన అపూర్వ స్పందన హైదరాబాద్, తెలంగాణపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమన్నారు. ఎకరాకు రూ.237 కోట్ల చారిత్రక ధర నమోదవడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక మైలురాయని తెలిపారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వం వల్లే తెలంగాణ పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. ఈ రికార్డు స్థాయి వేలం ద్వారా హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మరింత బలపడిందని.. భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్యూచర్ సిటీలో భూములకు రికార్డు ధరలు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఫ్యూచర్ సిటీ ఎంట్రెన్స్‌లో ఎయిర్ పోర్టుకు సమీపంలోని రావిర్యాలలో భూములను కొనుగోలు చేయడానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ ప్రాంతలో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు గురువారం ఈ-ఆక్షన్ ద్వారా వేలం నిర్వహించారు. మొత్తం నాలుగు భూమలకు నిర్వహించిన వేలం పాటలో చదరపు గజం భూమి గరిష్టంగా రూ.83,500కి అమ్ముడు పోయినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. వెయ్యి నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు లాండ్ పార్శిళ్లకు నిర్వహించిన వేలం పాట ద్వారా సుమారు రూ.140 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ భూములను ఈ-ఆక్షన్‌లో వేలం పాట ద్వారా విక్రయిస్తున్నట్లు గత నెలలో హోసింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. భూములను కొనుగోలు చేయడానికి సుమారు 17 సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో 1,113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొనుగోలు చేయడానికి బిడ్డర్లు పోటీ పడ్డారు. రూ.26 వేల కనీస ధరను నిర్ణయించగా.. దక్కించుకోడానికి పోటీ పడుతూ చదరపు గజం రూ.83,500కు ఒక డెవలపర్ సంస్థ దక్కించుకుంది. అలాగే.. ఇదే ప్రాంతంలోని సుమారు 6 వేల చదరపు గజాల విస్తీర్ణంలోని భూమి వేలం పాటలో చదరపు గజం రూ.62,500కు అమ్ముడుపోయింది. అంతేకాకుండా సుమారు 13,500 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని కొనుగోలు చేయడానికీ బిడ్డర్లు పోటీ పడ్డారు. ఈ నాలుగు భూముల వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.140 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కాగా.. కేపీహెచ్‌బీ కాలనీ, కుత్బుల్లాపూర్ చింతల్ ప్రాంతాల్లోని మరో నాలుగు ప్లాట్లకు (భూములకు) శుక్రవారం ఈ-ఆక్షన్ నిర్హహిస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్ 1-2లోని 5,898 చదరపు గజాలు, 2,420 చదరపు గజాల్లోని ప్లాట్ నెం 2, కుత్బుల్లాపూర్ చింతల్‌లోని 10,890 చదరపు గజాలు, 3,388 చదరపు గజాల భూములను వేలం ద్వారా విక్రయించనున్నారు.

Next Story