MLA అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ

by Disha Web Desk 2 |
MLA అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. ఎంఐఎంకు 7 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కనీసం 50 స్థానాల్లో పోటీలో నిలుస్తామని అన్నారు. ఇందుకు తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అంగీకరిస్తాడని అనుకుంటున్నట్టుగా చెప్పారు. తమ పార్టీ కనీసం 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకునేలా చూస్తామని.. అనంతరం 15 ఎంఐఎం ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెడతాం అంటూ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, అంతకుముందు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రభుత్వం హామీలు ఇస్తుంది, కానీ అమలు చేయడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు తమను కలవరని అన్నారు. కనీసం చెప్రాసిని చూపిస్తే వాళ్లనైనా కలుస్తామని చెప్పారు. ఇష్టా రీతిలో బీఏసీలో నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. చర్చ సందర్భంగా సభా నాయకుడు కనిపించడం లేదని అన్నారు. దీంతో, అక్బరుద్దీన్ వ్యాఖ్యలనపై మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గొంతు చించుకున్నంత మాత్రానా ఉపయోగం ఉండదని అన్నారు. అక్బరుద్దీన్ బీఏసీ సమావేశానికి రాకుండా, ఆయన బాధ్యత నెరవేర్చుకుండా ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు. ఆవేశంగా ప్రసంగం చేస్తే సరిపోదు..అర్థవంతంగా కూడా మాట్లాడొచ్చని అన్నారు. ఎంఐఎంకు 7 గురు సభ్యులు ఉన్నారని వారికే అంత సమయం ఇస్తే ఎలా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed