Jubilee Hills by Poll: భైంసా గతే భాగ్యనగరానికి పట్టబోతోంది.. ఎంఐఎం, కాంగ్రెస్‍పై రఘునందన్ రావు ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2025-10-08 13:13:11  IST  )

జూబ్లీహిల్స్ లో ఎంఐఎం, కాంగ్రెస్ చీకటి ఒప్పందం కుదిరిందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు.

Jubilee Hills by Poll: భైంసా గతే భాగ్యనగరానికి పట్టబోతోంది.. ఎంఐఎం, కాంగ్రెస్‍పై రఘునందన్ రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కు అయ్యాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ బలం లేకపోయినా అక్కడ పోటీ చేసే ఎంఐఎం తెలంగాణలో పుట్టి ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ లో తమ అభ్యర్థిని ఎందుకు నిలపడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‍లో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. జూబ్లీహిల్స్ బై పోల్‍లో ఎంఐఎం మద్దతు ఎవరికి ఇవ్వబోతోందని ప్రశ్నించారు. అన్న అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ కు మద్దతు ఇద్దామంటే తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్‍కు మద్దతు ఇద్దామని అనుకుంటున్నారని, ఎంఐఎం కూడా రెండుగా విడిపోయిందా అని ప్రశ్నించారు. డిసెంబర్‍లో రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకుందని మజ్లీస్ సూచించిన వ్యక్తికే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వబోతోందని అన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలిచి ఆ తర్వాత హైదరాబాద్ మేయర్ పీఠం గెలవబోతోందనే భయంతోనే ఈ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించబోతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం వ్యక్తి హైదరాబాద్ మేయర్ అయితే బైంసాకు భాగ్యనగరానికి తేడా లేకుండా పోతుందని ఆరోపించారు.


Next Story