రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

by Malleboina Mahesh |

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, రాష్ట్రంలో 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలతో పాటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం తో పాటు పాలు అందించాల‌ని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని డీసీఎంఎస్‌ల‌ను మార్క్ ఫెడ్‌లో విలీనం చేయాల‌ని సైతం నిర్ణయించామన్నారు. టీజీఆర్ఐసీ (తెలంగాణ రూర‌ల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేష‌న్‌)ను హాకాలో విలీనం చేయాల‌ని డిసిషన్ తీసుకున్నట్లు తెలిపారు. పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం భూ సేక‌ర‌ణ‌, పున‌రావాసం, మౌలిక వ‌స‌తుల స‌దుపాయాల కల్పనకు రూ.587 కోట్లు కేటాయించడానికి మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. సమావేశ వివరాలను మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.

రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు..

రాష్ట్రంలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల చొప్పున.. మొత్తం 2.50 లక్షల పేద కుటుంబాలకు ఈ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రతి సెగ్మెంట్‌లో 1500 కొత్త ఇళ్లు మంజూరు చేయనుండగా..ఉమ్మడి రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు సైతం ఆర్థిక సాయం చేసేలా నిధులు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి.. గోడ‌లు, శ్లాబు ద‌శ‌లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పునాదులు పూర్తయి.. గోడ‌లు, శ్లాబు ప‌డ‌ని ఇండ్లకు రూ.3 లక్షలు, గోడ‌లు పూర్తయి శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్లకు నిధులు కేటాయించేందుకు కేబినెట్ తీర్మానించినట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ దశల్లో చేసిన స‌ర్వేల ప్రకారం 14,800 వరకు కుటుంబాలు గుడిసెల్లో నివాసముంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, ఆ కుటుంబాల‌న్నింటికీ వెంటనే ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు ప‌త్రాలు అందించాల‌ని నిర్ణయించినట్లు వెల్లడించారు. గుడిసెలు లేని ఆద‌ర్శ రాష్ట్రంగా తెలంగాణ‌ను నిలుపుతామన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెర‌మెరి మండ‌లం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల‌కు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిర‌మ్మ ఇళ్లను జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని, కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారని తెలిపారు.

ఎల్ఐజీ తరహాలో..

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆరు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు. వీరిలో 18,500 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఉన్నాయని, వారందరికీ వెంటనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. క్యూర్ ప‌రిధిలోని 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో అల్పాదాయ వ‌ర్గాల వారి కోసం (ఎల్ఐజీ) మొత్తం ల‌క్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. వీరి కోసం నిర్మించే ఇళ్లు పాటుగా ‘ఆన్ డివైడెడ్ షేర్’ భూమిని కూడా వారి పేరు మీదుగా రిజిస్టర్ చేస్తామన్నారు. ఎంఐజీ తరహాలోనూ నిర్మిస్తామన్నారు. త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.

ఆర్డీఎస్ఎస్‌లో చేరాలని నిర్ణయం

విద్యుత్ పంపిణీ, మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ఆర్డీఎస్ఎస్ లో చేరేందుకు తెలంగాణ డిస్కమ్స్ తయారు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 2017 జనవరి 2న గత ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసిందని మంత్రి తెలిపారు. ఆ ఒప్పందంలో మీటర్ల ఏర్పాటు అంశం కూడా ఉందని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ ఒప్పందం చేసుకున్నాయని, విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ ఒప్పందాన్ని అమలు చేస్తామన్నారు. ఆర్డీఎస్ఎస్ లో చేరాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో చేరడానికి, వ్యవసాయానికి మీటర్లకు సంబంధం లేదని స్పష్టం చేశారు. వ‌చ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న గోదావ‌రి పుష్కరాల కోసం వివిధ పనులు చేప‌ట్టేందుకు రూ.1000 కోట్ల నిధులకు కేబినెట్ ఆమోదం తెలపగా.. తొలి విడ‌త‌గా రూ.300 కోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇన్నోవేషన్ పై ఫోకస్..

రాష్ట్రాన్ని 2030 నాటికి ప్రపంచంలోని టాప్‌-5 లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, అందుకే నెక్ట్స్ జనరేషన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026–30ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలిపారు. దావోస్ లో ఈ పాలసీని లాంఛనంగా ఆవిష్కరించామని, ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలతోపాటు 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను మారుస్తామన్నారు.

యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్‌ హెల్త్‌, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు ఎక్కువగా తయారీ మీద దృష్టి ఉంటే, ఇక నుంచి విలువైన ఇన్నోవేషన్‌ మీద ఎక్కువ ఫోకస్‌ పెడతామని, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ) యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పు తీసుకొస్తున్నామన్నారు. గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు.

భూముల కేటాయింపు.. వివిధ పోస్టులు మంజూరు

అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్ లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, ఆరు నాన్ టీచింగ్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 3 పోస్టుల మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఫైర్ స్టేషన్ కు 18 పోస్టుల మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి వెల్లడించారు.

Next Story