- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓఆర్ఆర్ చుట్టూ మెట్రోరైలు.. హెచ్ఎండీఏ ప్రతిపాదనలు
క్యూర్ పరిధిలో ప్రజా రవాణ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాలుష్య నివారణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: క్యూర్ పరిధిలో ప్రజా రవాణ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాలుష్య నివారణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే క్యూర్ పరిధిలో రెండో దశ మెట్రో మార్గాలతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) చుట్టూ మెట్రోరైలు కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి హెచ్ఎండీఏ, మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును మూడో దశలో చేపట్టేవిధంగా ప్రతిపాదనలు రూపొందించాలని నిర్ణయించారు. అయితే ఢిల్లీలో ప్రతి రోజు 40లక్షల ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. అదే తరహాలో క్యూర్ పరిధిలో అన్ని వైపుల మెట్రో కనిక్టివిటి పెంచేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెండో దశలో…
హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశకు సంబంధించిన డీపీఆర్ లను కేంద్రానికి పంపించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్-పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ.), జేబీఎస్ నుండి మేడ్చల్ (24.5 కి.మీ), జేబీఎస్ నుండి శామీర్‌పేట (22 కి.మీ) మొత్తం 122.6 కి.మీ.ల విస్తరణకు రూ.38,595కోట్ల అంచనాలతో డీపీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసిన విషయం తెలిసిందే.
మూడో దశలో..
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6కిలోమీటర్ల మార్గాన్ని రూ.7,168కోట్లతో అంచనాలతో రెండో దశ(బీ)గా ప్రతిపాదించారు. అయితే దీన్ని మూడో ప్రాజెక్టుగా పరిగణించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మూడో దశలోనే ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) మెట్రోరైలును విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. రెండో దశ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఆమోదించగానే పనులు చేపట్టడంతోపాటు మూడో దశ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు, డీపీఆర్ తయారుచేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఓఆర్ఆర్ చుట్టూ…
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) 158 కిలోమీటర్ల మార్గంలో ఉన్నది. అయితే రెండో చేపట్టిన మెట్రోరైలు ప్రతిపాదనలు ఓఆర్ఆర్ కు సమీపంలోనే ఉన్నాయి. ఢిల్లీ తరహాలో అన్ని ప్రాంతాను కలిపేవిధంగా మెట్రోరైలు ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఇబ్రాహీంపట్నం, పటాన్ చెరు, చౌటుప్పల్, మేడ్చల్, శామీర్ పేట్, శంషాబాద్, తుక్కుగుడ, ఘట్ కేసర్ వంటి ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా లక్షలాది మంది నగరానికి వస్తున్నారు. కానీ వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంలేదు. ఫలితంగా ప్రయాణ సమయం పెరగడంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. వీటన్నింటిని అధిగమించడానికి అన్ని ప్రాంతాలను కనెక్టివిటి ఉండేలా మెట్రోరైలే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో మొదటి 69కిలోమీటర్లు, రెండో దశ 122.6కిలోమీటర్లు, ఓఆర్ఆర్ చుట్టూ 160కిలోమీటర్లు, భారత్ ఫ్యూచర్ సిటీ 39.6కిలోమీటర్లు ఇలా మొత్తం 391కిలోమీటర్ల మెట్రోరైలు విస్తరించడానికి అవకాశముందని అ ధికారులు చెబుతున్నారు.






