- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరాల సుస్థిర అభివృద్ధికి ఐఐటీలు ముందుకు రావాలి: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నగరాలు స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వం, పారిశ్రామిక రంగం, పరిశోధనా, సంస్థలు ఉమ్మడి ప్రణాళికతో ముందుకు రావాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (

దిశ,సిటీ బ్యూరో: నగరాలు స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వం, పారిశ్రామిక రంగం, పరిశోధనా, సంస్థలు ఉమ్మడి ప్రణాళికతో ముందుకు రావాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్.రెడ్డి అన్నారు. ఈ ప్రయత్నంలో ఐఐటీలు ఇతోధికంగా తమ పరిజ్ఞానాన్ని, ఆలోచనలను పంచుకోవాలని సూచించారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు, ప్రొఫెసర్లు ‘సస్టైనబుల్ అండ్ గ్రీన్ సిటీస్’ అనే అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో మెట్రో ఎండీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో ఐఐటీ పూర్వ విద్యార్థులై వివిధ స్టార్టప్ లు, పరిశ్రమలకు చెందిన సీఈఓలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్వీఎస్.రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజల సమస్యలకు పరిష్కారం లభించేలా సాంకేతిక ఆవిష్కరణలు జరగాలని, ఇందులో ఐఐటీలు ప్రధాన భూమిక పోషించాలని అన్నారు. పట్టణీకరణ దిశగా దేశమంతా వేగంగా అడుగులు వేస్తున్న ప్రస్తుత తరుణంలో నగరాలపై ఒత్తిడి పెరుగుతోందని, నగరాలను పర్యావరణహితంగా, చిరకాలం మనగల్గి ఉండేలా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా నగర జీవన విధానాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉందని అయన అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ, మౌలిక అవసరాల పరికల్పన, పర్యావరణ సమతుల్యత, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే గృహ నిర్మాణం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, జలాశయాల సంరక్షణ, వర్షపు నీటి సద్వినియోగం, వరదల నివారణ చర్యలు మొదలైన అంశాలు ఈ పర్యావరణ అనుకూల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. అత్యంత నివాసయోగ్యమైనవిగా భారతీయ నగరాలను తీర్చిదిద్దడానికి కృషి జరగాలని చెప్పారు.
ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పటికీ హైదరాబాద్ మెట్రో రైల్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలోనే ఇతర ప్రధాన నగరాలకు పోటీ పడే విధంగా రూపొందించగలిగామని ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రోలో విద్యుత్తును అత్యంత పొదుపుగా వినియోగించుకొనే విధంగా అనేక నూతన ఆవిష్కరణలతో పర్యావరణహితంగా నిర్మించగలిగామని ఆయన వెల్లడించారు. అందువల్లనే ఇంతవరకు 350కి పైగా ప్రతిష్ఠాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయని అయన అన్నారు. ఒకప్పుడు మెట్రో వద్దు అన్న వారు ఇప్పుడు మెట్రో కోసం డిమాండ్ చేయడం చూస్తున్నామని, మారుతున్న ప్రజల అవసరాలను గుర్తించి వాటికి తగు సౌకర్యాలు కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనా, పారిశ్రామికవేత్తలపైన ఉందని, అందుకే విస్తృతమైన భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్టులు చేపట్టాలని ఎన్వీఎస్.రెడ్డి సూచించారు. ఇంకా రాబోయే రోజుల్లో చేపట్టనున్న మెట్రో విస్తరణ ప్రాజెక్టులో మరింత మెరుగైన ఆలోచనలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఇందుకు ఐఐటీ లాంటి సంస్థలు సహకారాన్ని కూడా తీసుకుంటామని వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి వర్చ్యువల్ గా ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. ప్రొఫెసర్ అశ్విన్ మహాలింగం, ప్రొఫెసర్ మనూ సంతానం, ప్రొఫెసర్ గీతాకృష్ణన్, ఐఐటీ మద్రాస్ నుండి ఉతీర్ణులై ఉన్నత స్థానాలలో ఉన్న పలువురు ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.






