రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు బయటకు రావొద్దు!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-27 10:34:46  IST  )

రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది.

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు బయటకు రావొద్దు!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో మధ్యాహ్నం ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana)కు మరోసారి వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని తెలిపింది.

ఈ క్రమంలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రేపు తెలంగాణలోని 4 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ(మంగళవారం) ఆదిలాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఈ క్రమంలో రాగల మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Next Story