ఉత్తర తెలంగాణ జిల్లాలకు అలర్ట్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర తెలంగాణ జిల్లాలకు అలర్ట్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

బంగాళాఖాతంలో బలపడనున్న అల్పపీడనం:

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రైతులకు, ప్రజలకు వర్ష సూచనతో పాటుగా వాతావరణ బులెటిన్ జారీ చేసింది. బంగాళాఖాతంలో సోమవారం ఈశాన్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కానుంది. తాజాగా మరో అల్పపీడనం ఈ నెల 25 న తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 27న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు:

రాష్ట్రంలో భారీ వర్షాలు కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయన్న కారణంతో పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, మెదక్, జనగాం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అదేవిధంగా, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లోని అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం కొంతమేర ప్రభావితమైంది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ ఈ వర్షాలు మరో కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అత్యధికంగా యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 16 సెం.మీ ల వర్షం:

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 16 సెం.మీ, మెదక్ జిల్లా అల్లాదుర్గ్ లో 12 సెం.మీ, జనగాం జిల్లా దేవరుప్పల్ లో 12 సెం.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా పాముకుంటలో 12 సెం.మీ, హైదరాబాద్ షేక్ పేట్ లో 10 సెం.మీ, ములుగు జిల్లా మల్లంపల్లిలో 10 సెం.మీ, జనగాం జిల్లా నర్మెట్టలో 9.8 సెం.మీ, హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ లో 9.7 సెం.మీ, భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాలలో 9.6 సెం.మీ, సిద్దిపేట్ జిల్లా కొండపాకలో 9.4 సెం.మీ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 9 సెం.మీ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 9 సెం.మీ, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 9 సెం.మీ, జనగాం జిల్లా కొడకండ్లలో 9 సెం.మీ, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 9 సెం.మీ, వికారాబాద్ జిల్లా దోమలో 9 సెం.మీ, జనగాం జిల్లా పాలకుర్తిలో 8 సెం.మీ, హన్మకొండ జిల్లా ధర్మసాగర్ లో 8 సెం.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా నారాయన్ పూర్ లో 8.3 సెం.మీ, సిద్దిపేట్ జిల్లా రామారంలో 8.3 సెం.మీ, కొమురవెల్లిలో 8.2 సెం.మీ, సిద్దిపేట్ అర్భన్ లో 7.8 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో 7 సెం.మీ, వికారాబాద్ జిల్లా కొడంగల్ లో 7 సెం.మీ, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో 7 సెం.మీ, మెదక్ జిల్లా రేగోడ్ లో 7 సెం.మీ, మెదక్ జిల్లా చేగుంటలో 6 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైనట్లు ఐఎండీ హైదరాబాద్ తెలిపింది.

Next Story