‘మెట్ గాలా’లో మెరిసిన తెలుగింటి తళుకు.. కోట్లు విలువ చేసే వజ్రాల హారంతో మేఘా సుధా రెడ్డి జిగేల్

by Ramesh Naini |

ప్రపంచ ఫ్యాషన్ దిగ్గజాలు తళుక్కుమనే అత్యంత ప్రతిష్ఠాత్మక ‘మెట్ గాలా’ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుధా రెడ్డి మరోసారి తనదైన ముద్ర వేశారు.

‘మెట్ గాలా’లో మెరిసిన తెలుగింటి తళుకు.. కోట్లు విలువ చేసే వజ్రాల హారంతో మేఘా సుధా రెడ్డి జిగేల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ ఫ్యాషన్ దిగ్గజాలు తళుక్కుమనే అత్యంత ప్రతిష్ఠాత్మక ‘మెట్ గాలా’ (Met Gala) వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుధా రెడ్డి మరోసారి తనదైన ముద్ర వేశారు. న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికగా జరిగిన ఈ ఫ్యాషన్ పండుగలో ఆమె ధరించిన దుస్తులు, కోట్ల రూపాయల ఆభరణాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారాయి.

కళ్లు జిగేలుమనే రూ. 142 కోట్ల నెక్లెస్..!

ఈ వేడుకలో అందరి దృష్టీ సుధా రెడ్డి ధరించిన భారీ నెక్లెస్‌పైనే పడింది. దీని విలువ సుమారు 15 మిలియన్ డాలర్లుగా సమాచారం.. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 142.8 కోట్లు! విక్టోరియన్ ఫినిషింగ్, పెద్ద రోజ్-కట్ డైమండ్స్‌తో రూపొందించిన ఈ హారంలో ప్రధాన ఆకర్షణ మధ్యలో ఉన్న 550 క్యారెట్ల లోతైన నీలిరంగు టాంజనైట్ లాకెట్. టాంజానియాలోని మెరలానీ కొండల్లో లభించే ఈ అరుదైన రత్నాన్ని ‘క్వీన్ ఆఫ్ మెరలానీ’గా పిలుస్తారు. ఈ నెక్లెస్‌తో పాటు ఆమె చేతులకు ఉన్న 30 క్యారెట్ల పోల్కీ డైమండ్ రింగ్, 40 క్యారెట్ల కొలంబియన్ ఎమరాల్డ్ రింగ్ ఆమె గ్లామర్‌కు మరింత వన్నె తెచ్చాయి. మెట్ గాలాలో ఇంత ఖరీదైనవి ధరించిన మహిళ ఈమే కావొచ్చని ఫ్యాషన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విదేశీ వేదికపై తెలంగాణ సంస్కృతి..

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ప్రత్యేకమైన దుస్తుల్లో సుధా రెడ్డి మెరిశారు. ‘ట్రీ ఆఫ్ లైఫ్’ (జీవన వృక్షం) థీమ్‌తో, పురాతన కలంకారీ కళాకృతుల స్ఫూర్తితో ఈ డ్రెస్‌ను రూపొందించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర చిహ్నాలైన పాలపిట్ట, జమ్మిచెట్టు, తంగేడు పూలతో పాటు కల్పవృక్షం వంటి తెలుగు మోటిఫ్‌లను అత్యంత అద్భుతంగా, చాకచక్యంగా పొందుపరిచారు. దుస్తుల ద్వారా హైదరాబాద్ సంస్కృతిని, తెలుగు జీవన విధానాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడమే తన లక్ష్యమని సుధా రెడ్డి పేర్కొన్నారు. ‘హైదరాబాద్ నా మూలం మాత్రమే కాదు.. అదొక భాష, ఒక జీవన లయ. నా సాంస్కృతిక మూలాలను గ్లోబల్ ఫ్యాషన్ భాషలో ప్రదర్శించడమే నా ఉద్దేశ్యం. ఈ డ్రెస్ కేవలం అలంకరణ కాదు, ఇది తరతరాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక జీవన సంగ్రహం’ అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గర్వంగా పంచుకున్నారు.

మెట్ గాలాలో హ్యాట్రిక్ ఎంట్రీ..

మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై నడిచే అవకాశం దక్కించుకున్న అతికొద్ది మంది భారతీయుల్లో సుధా రెడ్డి ఒకరు. 2021లో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత 2024లోనూ సందడి చేశారు. తాజాగా 2026 ప్రదర్శనతో మెట్ గాలా వేదికపై ప్రతిష్టాత్మక హ్యాట్రిక్ నమోదు చేశారు.

వ్యాపార, సేవా రంగాల్లోనూ మేటి..

ఎంఈఐఎల్ (Megha Engineering & Infrastructures Ltd) అధినేత పి.వి. కృష్ణా రెడ్డి సతీమణి అయిన సుధా రెడ్డి.. కేవలం పారిశ్రామికవేత్త భార్యగానే ఉండిపోకుండా ఆ సంస్థలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా, ‘సుధా రెడ్డి ఫౌండేషన్’ ద్వారా క్యాన్సర్ బాధితులకు అండగా నిలవడం, పిల్లల విద్య, మహిళా సాధికారత కోసం విశేష కృషి చేస్తున్నారు. ‘గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్’ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Next Story