- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోపభూయిష్టంగా వైద్య విద్య.. ఫైమా సర్వేలో బయటపడిన వాస్తవాలు
దేశంలో వేగంగా పెరుగుతున్న వైద్య కళాశాలల సంఖ్యకు సరిపడా మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, విద్యా ప్రమాణాలు లేవని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) తాజాగా విడుదల చేసిన నివేదికలో వె ల్లడైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో వేగంగా పెరుగుతున్న వైద్య కళాశాలల సంఖ్యకు సరిపడా మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, విద్యా ప్రమాణాలు లేవని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ఫైమా- రివ్యూ మెడికల్ సిస్టం (ఫై మా-ఆర్ఎంఎస్) పేరిట దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 2వేల మందికిపైగా వైద్య విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఎయి మ్స్, పీజీఐ, జిప్ మర్ వంటి ప్రముఖ వైద్య సం స్థల నిపుణులు, ఆండమాన్ నికోబార్ ద్వీపాల డాక్టర్లు సైతం ఈ సర్వేలో భాగమయ్యారు.
సమతుల్యత కోల్పోతున్న దేశం...
దేశంలో పుట్టగొడుగుల్లా మెడికల్ కాలేజీలు ఏర్పడుతున్నా... వాస్తవంలో వాటి ప్రమాణాలు ఘోరంగా ఉంటున్నాయని ఈ సర్వేలో చాలా మంది అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 90.4శాతం మంది ప్రభుత్వ వైద్య కళాశాలలకు, 7.8శాతం మంది ప్రైవేట్ కాలేజీలకు చెందినవారు. వీరిలో కేవలం 71.5శాతం మా త్రమే తగినంత పేషంట్ ఎక్స్ పోజర్ ఉందని, 54.3శాతం మంది మాత్రమే రెగ్యులర్ బోధన జరుగుతోందని, 69.2శాతం మంది ల్యాబ్ సదుపాయాలు సక్రమంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫ్యాకల్టీ తగినంతగా ఉందని 68.8శాతం, స్కిల్ ల్యాబ్ ఉన్నాయని 44.1శాతం మాత్రమే చెప్పారు. అదే సమయంలో 50శాతం మాత్రమే స్టైపెండ్ సమయానికి వస్తుందని, 29.5శాతం మాత్రమే నిర్ధిష్ట పని గంటలు ఉన్నాయని వెల్లడించారు. స్టైపెండ్స్ సకాలంలో రాక, అసలు చెల్లించక చాలా ప్రైవేటు కాలేజీల్లో వెట్టి చాకిరి చేస్తున్నట్లుగా విద్యార్థులు సర్వేలో వెల్లడించారు.
మానసిక ఒత్తిడి, సిబ్బంది కొరత..
సర్వేలో 73.9శాతం మంది అధిక పనిభారంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా వెల్లడించారు. 55.2శాతం మంది సిబ్బంది కొరత ఉందని, 40.8శాతం మంది తమ వర్క్ ఎన్విరాన్‌మెంట్ అత్యంత నరకప్రాయంగా ఉందని తెలిపారు. 89.4శాతం మంది దరిద్రంగా ఉన్న మౌలిక సదుపాయాలు వైద్య విద్య నాణ్యతను దెబ్బతీస్తున్నాయని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో బోధన కొంత మేర సక్రమంగా సాగుతుండగా, ప్రభుత్వ సంస్థల్లో పేషంట్ ఎక్స్ పోజర్ ఎక్కువగా ఉన్నప్పటికీ పరిపాలనా భారం ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.
అమలుకాని 2024 సిఫారసులు
గతేడాది నేషనల్ టాస్క్ ఫోర్స్ కూడా ఇలాంటి సర్వే చేసి, ఫిక్స్ డ్ డ్యూటీ అవర్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు, తల్లిదండ్రులతో వార్షిక సమావేశాలు, 10 రోజుల సెలవులు వంటి సిఫారసులు చేసింది. కానీ ఫైమా తాజా నివేదిక ప్రకారం... ఈ సిఫారసులన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని తేలింది. ప్రతి వైద్య కళాశాలలో తగిన మౌలిక సదుపాయాలు, స్టాఫ్ నియామకం, సమయానికి స్టైఫండ్ చెల్లిం పులు, తప్పనిసరి స్కిల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయా లని ఫైమా కోరింది. ఈ నివేదికను త్వరలో ఎ న్ఎంసీ, నీతిఆయోగ్ కు సమర్పించి దేశవ్యాప్తం గా వైద్య విద్యార్థుల సంక్షేమం కోసం స్పష్టమైన చర్యల కోసం విజ్ఞప్తి చేయనున్నట్లు ఫైమా వెల్లడించింది.
ఫైమా సర్వేలోని ప్రధాన అంశాలు...
- పనిచేసే ప్రాంతం నరకం - 40.8%
- తగిన పేషంట్ ఎక్స్ పోజర్ - 71.5%
- రెగ్యులర్ బోధన జరుగుతోంది - 54.3%
- సరైన ల్యాబ్ సదుపాయాలు - 69.2%
- ఫ్యాకల్టీ తగినంతగా ఉందని - 68.8%
- స్కిల్ ల్యాబ్ ఉన్న కాలేజీలు - 44.1%
- సమయానికి స్టైఫండ్ - 50%
- నిర్ధిష్ట పని గంటలు - 29.5%
- అధిక పరిపాలనా భారం - 73.9%
- సిబ్బంది కొరత ఉందని - 55.2%
- మౌలిక సదుపాయాల లోపం
విద్యపై ప్రభావం చూపుతోందని - 89.4%






