చెరువులకు చెర.. గ్రేటర్‌ పరిధిలో మాయమవుతున్న కుంటలు

by Disha Web Desk 23 |
చెరువులకు చెర.. గ్రేటర్‌ పరిధిలో మాయమవుతున్న కుంటలు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలోని చెరువులు, కుంటలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. శిఖం భూములను విచ్చలవిడిగా కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోని దుస్థితి. కబ్జాకోరుల దాహానికి ప్రకృతి సంపద సైతం కరిగిపోతోంది. చెరువులు జలకళను కోల్పోయి బహుళ అంతస్తుల భవనాలకు, వాటి డ్రెయినేజీ లేన్లకు నిలయంగా మారాయి.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని లింగం చెరువు, కందు కుంట(కందయ్య) లు కనుమరుగవుతున్నాయి.ఖాళీ జాగాల మాదిరి చెరువుల శిఖం భూములను ఆక్రమించుకుని రియల్టర్లు, ప్రజాప్రతినిధులు జోరుగా వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో చెరువులు జలకళను కోల్పోయి నివాస యోగ్యాలుగా మారుతున్నాయి.


లింగం చెరువులో అపార్ట్ మెంట్లు

మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 94,97,98,101లలో 16 ఎకరాల విస్తీర్ణంలో లింగం చెరువు(ఐడి నెంబర్ 2819) విస్తరించి ఉంది.మెదక్ జిల్లాకు వెళ్లే జాతీయ రహదారిని అనుకొని చెరువు విస్తరించి ఉండడంతో రియల్ వ్యాపారుల కన్ను చెరువు పై పడింది. చెరువును అనుకోని మూడు బడా నిర్మాణ సంస్థలు అపార్ట్ మెంట్లు, విల్లాలను నిర్మిస్తున్నారు. మెల్ల మెల్లగా చెరువుకు సంబంధించిన 9 మీటర్ల మేర బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ స్థలాలను చెరబట్టారు. చెరువు తూము నాలాను కూడా కబ్జా చేశారు.


వెబ్ సైట్ లో మ్యాప్ ప్రత్యక్షం..

లింగం చెరువు మ్యాప్ ను హెచ్ఎండీఏ వైబ్ సైట్ లో మాయం చేశారని ఇటీవల ‘దిశ’ పత్రికలో రాసిన కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు తిరిగి అప్ లోడ్ చేశారు. లింగం చెరువు సంబంధించి ఎఫ్ టీఎల్ పాయింట్లు (ఆర్ 35- ఆర్ 24), మరియు ( అర్ 24 - ఆర్ 20) అదేవిధంగా (ఆర్ 15- ఆర్ 9 ) చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ కూడా అక్రమించుకుని కంపౌండ్ వాల్, అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హస్తం ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎఫ్ టీఎల్ లో దాదాపు 9 మీటర్లు ఆక్రమించుకొని భారీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు.


లేఖ బుట్టదాఖలు..

లింగం చెరువు కబ్జాపై ’దిశ‘దినపత్రికలో వస్తున్న వరుస కథనాలతో మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ పోట్రు స్పందించారు. చర్యలు తీసుకోవాలని ఆర్డీఏ, స్థానిక తాహసీల్దార్లను ఆదేశించడంతో జాయింట్ సర్వే చేపట్టి హద్దులను నిర్ణయిద్దామని ఇరిగేషన్ అధికారులకు కుత్బుల్లాపూర్ తాహసీల్దార్ అబ్దుల్ రహేమాన్ ఖాన్ గత నెల 27వ తేదీన నార్త్ ట్యాంక్ డివిజన్ ఈఈ నారాయణకు లేఖ రాశారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న నివేదికల తో పాటుగా తాజాగా నిర్వహించిన రిపోర్డ్ లను కలెక్టర్ కు నివేదించాల్సి ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. గత నెల 27న రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ శాఖకు లేఖ రాసినప్పటికీ ఇప్పటివరకు వారి నుంచి స్పందన లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీనిని బట్టి చూసుకుంటే కబ్జాదారులకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎంత మేర సహకరిస్తున్నారని విషయం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

సందుకుంటది మరో కథ...

దుండిగల్ గండి మైసమ్మ మండలం బహదూర్ పల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 64 లో ఉన్న సందయ్య కుంట (సందుకుంట) ఐదెకరాల్లో విస్తరించి ఉంది. సర్వే నెంబర్ 63 లోని పది ఎకరాలలో కొంత ప్రభుత్వ భూమి ఉంది. చెరువు శిఖం తో పాటు సర్కారు స్థలాన్ని అక్రమించి, కొందరు భూ కబ్జాదారులు రియల్ దందా కొనసాగిస్తున్నారు. అక్రమ లే అవుట్ తో ప్లాట్లు చేసి, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేస్తున్నారు. ‘శ్రీ వెంకటేశ్వర నగర్’ పేరుతో 191 ప్లాట్ లను చూపిస్తూ లేఅవుట్ గీసి మరి బోర్డు ఏర్పాటు చేశారు. అంతేకాదు సదరు బోర్డులో అధ్యక్షులుగా శ్రీశైలం రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎండి ఉమర్ లుగా పేర్కొంటూ ఫోన్ నెంబర్లు కూడా అందులో పొందుపరిచారు. ప్రభుత్వ భూమి అందులో చెరువు భూమిని కబళిస్తూ ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు.ఇంత జరుగుతున్న రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. భూ కబ్జాదారుల నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని అధికార యంత్రాంగం ప్రోత్సహిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సందుకుంట చెరువు, ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Next Story

Most Viewed