గాజులరామారంలో భూ కబ్జాలు.. కొండలు పిండి చేస్తూ సాగుతున్న భూదందా

by Disha Web Desk 23 |
గాజులరామారంలో భూ కబ్జాలు.. కొండలు పిండి చేస్తూ సాగుతున్న భూదందా
X

దిశ,కుత్బుల్లాపూర్ : గాజులరామారంలో ప్రభుత్వ భూముల కబ్జాల పరంపర నిత్యం కొనసాగుతుంది. ప్రభుత్వ భూముల లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నప్పటికీ భూ బకాసురులు రెచ్చిపోతు ప్రభుత్వ వనరులను లూటీ చేస్తున్నారు.గాజులరామారం సర్వే నెంబర్ 329/1,79 ల లో భూ అక్రమణలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు కావడంతో భూ కబ్జా దారులు అందిన కాడికి దోచుకొని సొమ్ము చేసుకుంటున్నారు.జేసిబీ, హిటాచి మిషన్ లతో కొండలు బద్దలు కొడుతూ ప్రభుత్వ భూములను చదును చేసి ప్లాట్స్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు హెచ్చరించినప్పటికీ కబ్జా రాయుళ్లు పెడచెవిన పెడుతూ రాత్రికి రాత్రే అక్రమంగా గదులు నిర్మించి రెవెన్యూ అధికారులకు సవాల్ విసురుతున్నారు.

దేవేందర్ నగర్ లో....

గాజులరామారం దేవేందర్ నగర్ సర్వే నెంబర్ 329/1 లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను స్థానికంగా ఉన్న కొందరు కబ్జారాయుళ్లు ఆక్రమిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే గదులు నిర్మించి తెల్లారే సరికి తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. గదుల నిర్మాణం అనంతరం పేదలకు ఒక్కో ఫ్లాట్ లక్షల రూపాయలకు అమ్ముతూ దర్జాగా కాసులు పోగేసుకుంటున్నారు. ఈ తంతును దేవేందర్ నగర్ సేవాలాల్ మహారాజ్ ఆలయం సమీపంలో కొందరు కబ్జా దారులు బుధవారం కానిచ్చారు. రూమ్ నిర్మాణం చేసి పేదలకు అమ్మినట్లు సమాచారం. ఈ అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గాజులరామారం మెట్కానీ గూడలో....

గాజులరామారం మెట్కాని గూడలో గల సర్వే నెంబర్ 79 లోని ప్రభుత్వ భూములను కొందరు కబ్జాదారులు కొల్లగొడుతున్నారు. యదేచ్చగా కొండలను పిండి చేస్తూ ప్లాట్స్ చేసి అక్రమంగా గదులు నిర్మించి అమ్ముకుంటున్నారు.ఇక్కడి కబ్జా దందాపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed