- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా
ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి రూ. కోట్లు విలువజేసే భూములను కబ్జా చేస

దిశ, మేడ్చల్ బ్యూరో : ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి రూ. కోట్లు విలువజేసే భూములను కబ్జా చేస్తు న్నారు. ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖలో అవి నీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. రూ.లక్షల్లో డబ్బులు దండుకొని ఏకంగా భూ రికార్డులను సైతం ట్యాంపరింగ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం.. అన్నీ సక్రమంగా ఉన్నా భూ యాజమానులకు తీరని అన్యాయం చేయడం... వివాదాల్లో ఉన్న భూములు కొలిక్కి రాకముందే పెద్ద మొత్తంలో డబ్బులు దండు కుని వేరొకరికి కట్టబెట్టడం వంటివి మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో తరచూ వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతుండగా, అదే స్థాయిలో భూ మాఫియా అరాచకాలు పెరిగిపోతున్నాయి. వివాదాస్పద భూములు, ఖరీదైన ప్రాంతాల్లో ఖాళీ జాగాల మీద కన్నేసి కబ్జా చేసేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, యజమానులకే తెలియకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
ఇదో వ్యవస్థీకృత మాఫియా..
భూ మోసాల వెనుక వ్యవస్థీకృత మాఫియా ఉంటోంది. ఓపెన్ ల్యాండ్స్, ప్రవాసుల భూములు గుర్తించడం మొదలు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించే వరకు పద్ధతి ప్రకారం జరుగుతోంది. కొందరు రియల్టర్లు కేవలం వివాదంలో ఉన్న భూముల్ని తక్కువ ధరకు కొని.. ఆ తర్వాత సక్రమం చేసి ఇతరులకు విక్రయిస్తున్నారు. మరికొందరు ప్రజాప్రతినిధులు అంగ, ఆర్థ, రాజకీయ బలంతో భూముల కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ తరహా భూముల విషయంలో ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో గజం రూ. 2 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో కొందరు రియల్టర్లు, రౌడీ షీటర్లు, పాత నేరస్తులు భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారు.
మచ్చుకు కొన్ని ఘటనలు..
-కీసర మండలం రాంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 385లో ఎకరం భూమిని 1999లో జమ్మల నగేష్ అనే వ్యక్తి నుంచి బోందుగుల భారతి, నంద్యాల రజితా రెడ్డి, బోందుగుల చంద్రశేఖర్ రెడ్డి, చామల వెంకటనర్సింహరెడ్డిలు కొనుగోలు చేశారు.2006లో ఎకరం భూమిని నలుగురి పేరిట పార్టిషన్ డీడ్ చేసుకున్నారు.2016లో నిబంధనల ప్రకారం నాలా మార్పు చేసుకొని, 2019లో మండల సర్వేయర్ చేత గుర్తించిన హద్దుల ప్రకారం నలుగురు వారి వారి పొజిషన్‌లో ఉండగా.. 26 సంవత్సరాల తర్వాత సుబ్బారెడ్డి అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి రూ.50 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, స్థలానికి చెందిన అసలు యాజమాని తనకు సుబ్బారెడ్డి ఎవరో తెలియదని, అతనిపై చర్యలు తీసుకోవాలని కీసర పోలీస్‌స్టేషన్‌లో గత నెలలో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- అల్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని 573,574 సర్వే నెంబర్లలో మూడున్నర ఎకరాల ప్రైవేటు భూమి, ఐదున్నర ఎకరాల వివాదాస్పద యూఎల్‌సీ మిగులు భూములను బోగస్ పత్రాలతో కబ్జా చేసేందుకు కొందరు యత్నించారు. 9 ఎకరాల్లో 10 పెద్ద ఇండ్లు ఉన్నట్టు అల్వాల్ మున్సిపల్ అధికారులు ధ్రువీకరించి, వాటికి ఇంటి నెంబర్లను కేటాయించి రికార్డుల్లోకి ఎక్కించారు. అయితే, ఇంటి నెంబర్లు కేటాయించిన స్థలంపై ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వం మధ్య న్యాయ స్థానంలో కేసు నడుస్తోంది. మొత్తం భూమి తనదేనంటూ మామిడి జనార్ధన్ రెడ్డి అనే వ్యక్తి అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని సంప్రదించగా గత ఫిబ్రవరిలో ఒక రోజునే స్వీయ మదింపు కింద దరఖాస్తు చేయించి, ఆదే రోజున అన్నింటినీ ఆమోదించారు.
నిబంధనల ప్రకారం స్వీయ మదింపు దరఖాస్తుతో పాటు రిజిస్టర్డ్ సేల్ డీడ్‌ను జత చేయాలి. ఆ వివరాల ప్రకారం బిల్ కలెక్టర్ లేదా ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ సహాయ ఉప కమిషనర్ క్షేత్రస్థాయిలో ఇంటిని పరిశీలించకుండానే ఇంటి నెంబర్లను జారీ చేశారు. బోగస్ పత్రాలతో జారీ అయిన ఇంటి నెంబర్ల ఆధారంగా అక్రమణదారు గత మే నెలలో రిజిస్ట్రేషన్‌కు ఏర్పాటు చేసుకున్నారు. ముందుగానే రూ.80 లక్షలు రిజిస్ట్రేషన్ చార్జీల కింద చెల్లించారు. బాధితుడు నిమ్మ మోహన్ రెడ్డి.. భూ వివాదం కోర్టులో నడుస్తుందని తెలియజేయడంతో రిజిస్ట్రేషన్ కోసం మూడు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే, ఇక్కడ మామిడి జనార్ధన్ రెడ్డికి పట్టాదారు పాసు బుక్‌లు ఇవ్వగా మోహన్ రెడ్డి కోర్టుకెక్కడంతో రద్దు అయినట్లు తెలిసింది.
అల్వాల్ మండలం కానాజీగూడలో గ్రీన్ ఫీల్డ్ కాలనీలో భూ వివాదం నడుస్తోంది. దీంతో అక్కడక్కడ ఖాళీ స్థలాలు మిగిలి ఉన్నాయి. ఇదే అదనుగా భావించిన సింగిరెడ్డి మోహన్ రెడ్డి, సింగిరెడ్డి సంజీవరెడ్డిలు లే అవుట్ వేసి ప్లాట్లను విక్రయించారు. సర్వే నెంబర్ 385లో తమకు స్థలం ఉందంటూ దాదాపు 3 ఎకరాల భూములకు వేర్వేరుగా బోగస్ పట్టాదార్ పాస్ పుస్తకాలను తీసుకున్నారు. ప్లాట్ల కొనుగోలుదారులు కోర్టును ఆశ్రయించడంతో పాస్‌బుక్‌లను రద్దు చేశారు. అయినా, ఆ భూమి కబ్జాదారుల ఆధీనంలోనే ఉండడం రెవెన్యూ అధికారుల అవినీతికి అద్దం పడుతోంది. అల్వాల్ మండల తహసీల్దార్‌గా నాగమణి ఉన్నప్పుడు సర్వే నెంబర్లు 573, 574లతోపాటు సర్వే నెంబర్లు 385లో పాసుబుక్‌లు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె హయాంలో మండలంలో ఎన్ని పాసుబుక్‌లు జారీ అయ్యాయో సమగ్రంగా దర్యాప్తు చేసినట్లయితే మరిన్నీ భూ కుంభకోణాలు బయటపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






