మేడ్చల్ జిల్లాలో 28115 ఎకరాల్లో సాగు

by Mahesh |
మేడ్చల్ జిల్లాలో 28115 ఎకరాల్లో సాగు
X

దిశ, మేడ్చల్ బ్యూరో: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఈ వానాకాలంలో (ఖరీఫ్) 28,115 ఎకరాల్లో పంట సాగు జరిగే అవకాశం ఉందని, జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలను రూపొందించింది. అందుకు అనుగుణంగా, రైతులకు అవసరమైన ధాన్యం, విత్తనాలు, ఫర్టిలైజర్స్ అందుబాటులో ఉంచేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. మేడ్చల్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 28,585 ఏకరాలుగా ఉంది. కాగా గతేడాది వానాకాలంలో 26,908 ఎకరాల్లో సాగు చేశారు. దీనితో, ఈ వానాకాలంలో సాధారణ సాగు కు అటు ఇటుగా అంచనాలను రూపొందించడంతో (28,115 ఎకరాల్లో) సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ సారి జిల్లాలో ఏయే పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉందో వాటికి సంబంధించిన అంచనాలు ఇలా ఉన్నాయి.

వరి సాగు అంచనా 18,900 ఎకరాలు

మేడ్చల్ జిల్లాలో ఈ వానాకాలంలో 18,900 ఎకరాల్లో వరి సాగు చేసే ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అయితే, జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 11,082 గా ఉంది. అయినప్పటికీ, గత ఏడాది సాధారణ సాగుకు మించి 17,880 ఎకరాల్లో వరిని సాగు చేశారు. దీంతో, వరి సాగు అంచనాలకు మించి జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సారి దాదాపు 18,900 ఎకరాల్లో సాగు జరగవచ్చని భావిస్తున్నారు. ఈ వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే, గత ఏడాది లాగే వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.

ఉద్యానవన పంటలు 9,164 ఎకరాల్లో

ఉద్యాన పంటలు కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్ల తోటల సాగులో మేడ్చల్ జిల్లా ముందు వరుసలోనే ఉండేది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉండటం వల్ల మేడ్చల్ జిల్లా రైతులు ఎక్కువగా రైతులు ఈ పంటల సాగుకు పూనుకునే వారు. ఈ పంటలకు డిమాండ్ కూడా ఎక్కువే. కానీ గతేడాదితో పోల్చితే ఈ వానాకాలంలో మేడ్చల్ జిల్లాలో దాదా పుగా 2 వేలకు పైగా ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. గతేడాది 11,500 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఈ ఏడాది 9,164 ఎకరాల్లోనే వేసే అవకాశం ఉందంటున్నారు. ఇందులో కూరగాయలు 1820 ఎకరాలు, పండ్ల తోటలు 4170 ఎకరాలు, పూలు, గడ్డి రకాలు మరో 2250 ఎకరాలు కలిపి మొత్తం 9164 ఎకరాల్లో సాగు జరగవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా జిల్లాలో కంది 50 ఎకరాల్లో, పత్తి 130 ఎకరాల్లో, మక్క జొన్న 25 ఎకరాల్లో, పచ్చ జొన్న, పెసర, మినప, ఆముధ పంటలు కలిపి మరో 300 ఎకరాలు, వెరసి జిల్లాలో మొత్తం 28 వేల ఎకరాల్లో పంట సాగు జరగవచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.

సరిపడా విత్తనాల స్టాక్

జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం అనుసరించి, అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేరీ రేఖ వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా వరి విత్తనం 5 వేల మెట్రిక్ టన్నులు, పత్తి గింజలు 130 క్వింటాళ్లు, కంది వంద క్వింటాళ్ల, మక్క కొన్న 250 క్వింటాళ్లు, జవార్, పెసర, మినప, ఆముదం విత్తనాలు అన్నీ కలిపి మరో వంద క్వింటాళ్ల వరకు, అలాగే అన్నీ సరిపడా విత్తనాల స్టాక్ అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారిని మేరీ రేఖ వెల్లడించారు.

అందుబాటులో ఎరువులు

అదేవిధంగా, జిల్లాలో వానాకాలంలో పంటల సాగుకు సరిపడా ఎరువులు కూడా డీలర్స్ వద్ద అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారిని మేరీ రేఖ వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా, యూరియా 2194 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2345 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 29,327 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 827 మెట్రిక్ టన్నులు ఎస్ఎస్‌పీ 165 మెట్రిక్ టన్ను లు అందుబాటులో ఉన్నట్టు ఆమె తెలిపారు. ఈసారి అంచనాలకు మించి ఎరువుల స్టాక్ అందుబాటులో ఉందని మేరీ రేఖ తెలిపారు.

Next Story