ఇదీ రోడ్డేనా.. అనునిత్యం నరక ప్రయాణం

by Batti.Sumithra |

ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ఇంకా గ్రామీణ ప్రాంత రహదారుల దుస్థితులు మారడం లేదు.

ఇదీ రోడ్డేనా.. అనునిత్యం నరక ప్రయాణం
X

దిశ, రేగోడ్ : ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ఇంకా గ్రామీణ ప్రాంత రహదారుల దుస్థితులు మారడం లేదు. ఎన్నికల వేళ అన్ని పార్టీల నాయకులు ప్రధానంగా మెరుగైన తారు రోడ్లను వేయిస్తామని చెప్పడం గెలుపు తర్వాత రోడ్ల హామీని మరువడం పరిపాటిగా మారింది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా అందోల్ నియోజకవర్గంలోని మండల కేంద్రాలైన రేగోడ్, అల్లాదుర్గం నుండి గల రహదారి ప్రమాదకరంగా మారింది. జగిత్యాల చౌరస్తా నుండి వెంకట్రావ్ పేట మీదుగా అల్లా దుర్గంకు ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి ఉంది. చాలా సంవత్సరాల కిందట వేసిన తారు రోడ్డు మొత్తం తొలగిపోయి కంకర రోడ్డుగా మారి పోయింది.

సుమారుగా 6 కిలోమీటర్ల ఈ రోడ్డుపై కంకర పరిచినట్లుగా తయారై వాహనదారులను భయానికి గురి చేస్తుంది. రోడ్డు అధ్వాన్నంగా మారినందున పలు మార్లు ప్రజలు ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రధాన హైవేకు వెళ్లాలంటే ఇదే దగ్గరి దారి కావడంతో ప్రయాణీకులు అధికంగా రాకపోకలు కొనసాగిస్తుంటారు. కంకర మయంగా మారిన రోడ్డుపై ప్రయాణం వల్ల వాహనాలు పాడవడంతో పాటు ఒళ్ళు హూనం అవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మంత్రి స్పందించి అల్లాదుర్గం- రేగోడ్ రోడ్డును తారు రోడ్డుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story