- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫార్మా కంపెనీల కొత్త ఎత్తుగడ..కాలుష్య జలాలకు సుందరీకరణ ముసుగు !
చెరువులు, కుంటల్లోకి ఫార్మా కంపెనీలు వదులుతున్న కాలుష్య జలాలతో ఆ ప్రాంతం అగమవుతున్నది.

దిశ, సంగారెడ్డి బ్యూరో/జిన్నారం : చెరువులు, కుంటల్లోకి ఫార్మా కంపెనీలు వదులుతున్న కాలుష్య జలాలతో ఆ ప్రాంతం అగమవుతున్నది. పంటలు విషతుల్యం, మనుషులకు అంతుచిక్కని వ్యాధులు, ఆ నీళ్లు తాగి పశువులు మృత్యువాత ఈ పరిణామాలతో ఊరిడిచి వెళ్లే పరిస్థితి. కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం ఆందోళనకు ఫార్మా కంపెనీ మందుగోలి లాంటి ప్లాన్ చేసింది. కాలుష్యం వదిలేయండి. మీ కుంటలను సుందరీకరిస్తామని ముందుకొచ్చింది. అవసరమైతే రూ.4 కోట్లు వేచిస్తామని గ్రామ లీడర్లతో చెప్పిస్తున్నది. ఇది తెలిసి గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు. కుంటలోకి కాలుష్య జలాలు రాకపోతే అదే చాలు.. సుందరీకరణ ఎందుకు..? అని ప్రశ్నిస్తున్నారు. కంపెనీతో ములాఖాత్ అయిన లీడర్లు గ్రామస్తుల నుంచి వ్యతిరేకత చూసి ఖంగు తింటున్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు నల్లకుంట వ్యవహారం ఇది. వివరాల్లోకి వెళితే...
అప్పుడు గులాబీ..ఇప్పుడు నల్లరంగులోకి..
దోమడుగు నల్లకుంట అంటే ఈ ప్రాంతంలో తెలియని వారుండరు. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా ఈ కుంట జలాలు గులాబీ రంగులో ఉంటాయి. వర్షకాలం వచ్చిందంటే మీడియాలో ఈ కుంటలోని కాలుష్య జలాల కథనాలే కనిపిస్తాయి. సమీపంలోని హెటిరో ఫార్మా కంపెనీతో పాటు మరో రెండు చిన్న కంపెనీలు ఈ కుంటలోకే కాలుష్య జలాలను ఏళ్లుగా వదులుతున్నాయి. కాగా ఇటీవలి వర్షాలకు నీళ్లు పూర్తిగా నల్లరంగులోకి మారిపోయాయి. ఈ నీళ్లు తాగి పశువుల ప్రాణాలు పోతుండగా ఆ ప్రాంతంలో పంటలు పూర్తిగా విషతుల్యం అయ్యాయి. స్థానిక ప్రజలు క్యాన్సర్, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ కంపెనీపై ఎంతో కాలంగా గ్రామస్తులు పోరాడుతూనే ఉన్నారు. ఈ మధ్య వరుస ఆందోళనలు చేపట్టారు. కలెక్టర్ ముందు ఆ జలాలతో ధర్నా చేశారు. ఈ క్రమంలో పరిశ్రమ ప్రతినిధులు పలు మార్లు గ్రామస్తులతో చర్చలు జరిపారు. నష్టపరిహారం ఇస్తామని, మరేమైనా సహాయం అందిస్తామని ఆశ చూపారు. కుంటలోకి జలాలు వదలొద్దని డిమాండ్ చేశారు.
సుందరీకరణ ఎత్తుగడ..
గ్రామస్తులను శాంతింప చేయడానికి హెటిరో కొత్త డ్రామాకు తెర తీసింది. గుమ్మడిదల మున్సిపాలిటీ, దొమడుగులోని పార్టీల లీడర్లను తమవైపు తిప్పుకున్నారు. ఇక వారితో కథ నడిపిస్తున్నారు. రూ.4 కోట్లు వెచ్చింది నల్లకుంటను సుందరీకరించడానికి కంపెనీ ముందుకు వచ్చిందని ప్రచారం చేశారు. ఈ మేరకు గ్రామస్తులతో కూడా చర్చలు జరిపారు. అయ్యింది..అయ్యింది.. కుంట బాగు చేస్తారట చెయ్యనిద్దాం అని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే కాలుష్య జలాలు రాకుండా చేస్తారా..? అంటే మాత్రం కంపెనీ ప్రతినిధుల నుంచి లీడర్ల నుంచి సమాధానం రావడం లేదు. అంటే వచ్చే కాలుష్యం వస్తుంది. కుంటను మాత్రం సుందరీకరిస్తాని గ్రామస్తులకు అర్థం అయ్యింది. ఈ క్రమంలోనే సుందరీకరణ వద్దు.. కాలుష్య జలాలు రావద్దు.. ఇదే డిమాండ్ ను గ్రామస్తులు గట్టిగా వినిపిస్తున్నారు.
పూర్తిగా నీటిని తొలగించాలి...
గ్రామస్తుల పిర్యాదుతో గతంలో అంతే 2007లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కుంటలోని జలాలను పూర్తిగా తొలగించిన సందర్భాన్ని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పీసీబీ అధికారులు మరో సారి నీటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే పీసీబీ అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు. లీడర్ల ను మచ్చిక చేసుకుని చెరువును సుందరీకరణ చేయాలని చేస్తే మరో ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. కాలుష్య జలాలు కుంటలోకి రాకుండా అడ్డుకట్ట వేసే వరకు ఆందోళన చేస్తామని చెబుతున్నారు. పరిశ్రమతో ఏకమై గ్రామస్తులను ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతుండడంతో లీడర్లు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఈ వరుస పరిణామాలతో దోమడుగులో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. చూడాలి ఏం జరగనుందో...






