కాగితాలకే పరిమితమైన పచ్చదనం.. క్షేత్రంలో ఎడారి

by Naga Rani Yarlagadda |

ఇటీవల పనికి ఆహార పథకానికి సంబంధించి జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కాగితాల్లో ఉన్నట్లుగా క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించదు.

కాగితాలకే పరిమితమైన పచ్చదనం.. క్షేత్రంలో ఎడారి
X

దిశ, మిరుదొడ్డి: అడవులలో చెట్లు పెంచడానికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే అధికారులు మాత్రం అంతంత మాత్రంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు మరచి పచ్చగా ఉండవలసిన అడవులను ఎడారిలా మార్చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో టేకుల్లా అని పిలువబడే సుమారు 400 ఎకరాల విస్తీర్ణం గల అటవీ ప్రాంతం ఉంది. ఇందులో ప్రతి ఏటా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేల సంఖ్యలో మొక్కలు నాటుతారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వందల్లో కూడా కనిపించవు. ఉపాధిహామీ కూలీలతో తీయించిన గుంతలు మాత్రమే దర్శనమిస్తాయి. ఎక్కడో తూ తూ మంత్రంగా నాటిన మొక్కలు వర్షాకాలం వస్తే వాటంతటవే పెరగాలే కానీ, ఎండాకాలంలో మాత్రం వాటికి నీటిని పోసే నాథుడే కరువయ్యారంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కాస్తున్న ఎండలకు నాటిన మొక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి. అధికారులు మాత్రం మొక్కలు నాటామని, వాటికి ట్యాంకర్ల ద్వారా నీరు కూడా అందిస్తున్నామని లక్షల రూపాయల ఈజీఎస్ నిధులు పక్కదారి మళ్లిస్తున్నారు. అడవిలోకి వెళ్ళి చూస్తే క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది.

జిల్లా అధికారుల తనిఖీలు కాగితాల వరకే పరిమితం

ఇటీవల పనికి ఆహార పథకానికి సంబంధించి జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కాగితాల్లో ఉన్నట్లుగా క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించదు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు, హరిత వనాలు కార్యక్రమంలో భాగంగా వేల సంఖ్యలో మొక్కలు నాటినట్లు అధికారులు లెక్కల్లో చూపించారు. 2022 నుంచి 2024 వరకు సుమారు అటవీ ప్రాంతంలో 20 వేలకు పైగా మొక్కలు నాటామని చెప్తున్నారు, కానీ అక్కడికి వెళ్లి చూస్తే అందులో 30 శాతంలోపే మొక్కలు ఉండటం గమనార్హం. మిగతావన్నీ గుంతలు మాత్రమే కనిపిస్తాయి. 2022 నుంచి 2024 వరకు 924 మంది ఉపాధి హామీ కూలీలు మొక్కలు నాటడానికి గుంతలు తీయగా, వారికీ రెండు లక్షల 30 వేల రూపాయల వరకు వారి వారి ఖాతాలో జమ చేశారు. మరికొన్ని చోట్ల మొక్కలు పెరిగి నీరు లేక ఎండిపోతున్నాయి. ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు అందిస్తున్నామని, ట్యాంకర్లకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లింపులు జరిగినట్లు తనిఖీల్లో చూపించారు.

గ్రామపంచాయతీకి సంబంధించిన ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరు అందించి సుమారు లక్షన్నర రూపాయలు ఖర్చు చూపించారు. అలాగే ఇతర ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా ఐదున్నర లక్షల రూపాయలకు పైగా సదరు గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా నేరుగా చెల్లింపులు జరిపినట్టు తనిఖీల్లో చూపించారు. సుమారు 7 లక్షల రూపాయలకు పైగా ట్యాంకర్లకు బిల్లులు చెల్లిస్తే, మరి మొక్కలు ఎందుకు ఎండిపోతున్నాయో అధికారులకే తెలియాలి. దీన్ని బట్టి అధికారులు, గ్రామ పంచాయతీ అధికారి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పనితీరు ఎలా ఉందో చూస్తే అర్థమవుతుంది. మొక్కల పెంపకంలోనే ఇన్ని అవకతవకలు జరిగితే, ఉపాధి హామీ పథకంలో జరిగే మిగతా పనులు, సీసీ రోడ్లు కానీ, రైతుల కల్లాలు, పశువుల షెడ్లు, రైతుల పొలాల్లో ల్యాండ్ లెవెలింగ్, ఇంకుడు గుంతలు వంటి ఎన్నో రకాల పనులలో ఇంకెన్ని నిధులు దుర్వినియోగం జరిగాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని పెట్టిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story