పోడు భూములు సాగుచేసే వారికి న్యాయం చేస్తాం: మంత్రి హరీష్ రావు

by Dishanational1 |
పోడు భూములు సాగుచేసే వారికి న్యాయం చేస్తాం: మంత్రి హరీష్ రావు
X

దిశ, మెదక్ టౌన్: ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగు చేస్తూ అటవీ హక్కు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం కల్పించడంతోపాటు అడవులు సంరక్షణ, పునర్జీవనానికి శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం కొరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 85 గ్రామాలలో 7,740 ఎకరాలకు సంబంధించి 4,503 క్లెయిమ్ లు స్వీకరించి ఆన్ లైన్ లో పొందుపరిచామని అన్నారు. కాగా 85 గ్రామ పంచాయితీలలోని 140 హాబిటేషన్ లలో 4,606 ఎకరాలకు సంబంధించి 2,776 క్లెయిమ్ లు సకాలంలో వచ్చిన ఆన్ లైన్ గ్రామ వివరాలు కనిపించక పొందుపరచలేకపోయారని అన్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలు మండలాల వారీగా ఏంపీడీఓలకు అందించవలసినదిగా అటవీశాఖాధికారికి సూచించారు.

రెవెన్యూ, పంచాయత్ రాజ్, అటవీశాఖలు సమన్వయం చేసుకుంటూ ఏంపీడీఓలు గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని 2005 కంటే ముందు నుండి అన్యాక్రాంతంగా పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులను, మూడు తరాలు అనగా 75 సంవత్సరాలనుండి పోడు భూములను సాగుచేస్తున్న గిరిజనేతరులకు సంబంధించిన క్లెయిమ్ లను గ్రామ స్థాయి కమిటీలో క్లెయిమ్ దారు సమక్షంలో క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలని, ఆయా స్థాయి కమిటీలో తీర్మానాలను, రిజిస్టర్లను పక్కాగా నమోదు చేయాలన్నారు. అటవీ భూములలో పోడు వ్యవసాయం ఎప్పటి నుండి జరుగుతుందన్న విషయాన్ని శాస్త్రీయంగా నిర్థారించేందుకు శాటిలైట్ మ్యాపుల ప్రకారం సాంకేతికతతో జీపీఎస్ సిస్టం ద్వారా డిజిటల్ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి పక్కాగా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. భూమే జీవనాధారంగా బ్రతుకుతున్న వాళ్లకు పట్టాలిచ్చి గట్టుకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, తద్వారా వారికి రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు అందుతాయని అన్నారు. కాబట్టి మండల పరిషత్ అధికారులు ఫారెస్ట్ రేంజ్ అధికారులతో టై-అప్ చేసుకుని నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం డిజిటల్ సర్వే నిర్వహించి, గ్రామాల నుండి తీర్మానాలు పంపాలని సూచించారు. పోడు భూములు సాగు చేస్తున్న నిజమైన గిరిజన, గిరిజనేతరులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు అందించడంతోపాటు, ఇకముందు అటవీ భూములు ఆక్రమణలు జరుగకుండా, వాటి పునర్జీవనానికి అటవీ రక్షణ చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. అడవులు క్షీణించడం వల్ల మానవమనుగడకే ప్రమాదం పొంచివుంది కాబట్టి భవిష్యత్తులో ఒక్క అంగుళం అటవీ ప్రాంతం కూడా అన్యాక్రాంతం చేయమని ప్రజలలో అవగాహన కలిగించాలని, ప్రభుత్వం కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని తెలపాలని అన్నారు. బాధ్యాతాయుతమైన అధికారులుగా త్వరగా పోడు భూములను సర్వే చేసి గిరిజన, గిరిజనేతరులకు న్యాయం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మెదక్, నరసాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, ఆ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, అదనపు ఎస్పీ బాలస్వామి, డీఎస్పీలు, జిల్లా పరిషత్ సీఈఓ శైలేష్, డీఆర్ డీవో శ్రీనివాస్, డీఎఫ్ఓ రవి ప్రసాద్, ఆర్.డీ.ఓ. సాయి రామ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కేశూరం, ఏంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed