త్వరలో 40 వేల ఉద్యోగాలు: మంత్రి వివేక్

by Bhanu |

సర్పంచ్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ మాదిరి కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు.

త్వరలో 40 వేల ఉద్యోగాలు: మంత్రి వివేక్
X

దిశ, సిద్దిపేట: సర్పంచ్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ మాదిరి కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణతో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5లక్షల రేషన్ కార్డులను అందించినట్లు స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇంటికో ఉద్యోగం పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఉద్యోగాలే ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించారు. మరో 40 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నట్లు హుస్నాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి నాటి అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ అక్రమ సంపాదన గురించి కవితనే ప్రజలకు వివరిస్తున్నారన్నారు. కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ఆదరణతో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పార్టీ చేరిన నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అత్తు ఇమామ్, సాకి ఆనంద్, ఎల్లం యాదవ్, కలీముద్దీన్, దాస అంజయ్య, లక్ష్మి, మిట్టపల్లి శ్రీనివాస్, బిక్షపతి, వాహబ్, అజ్మత్, గియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story