- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇస్నాపూర్..ఇజ్జత్ కా సవాల్
చైర్మన్ పీఠంపై కన్నేసిన కొందరు ప్రధాన నాయకులు సీటును కైవసం చేసుకునే దిశగా రాజకీయాలు మొదలుపెట్టారు.

దిశ, పటాన్ చెరు : పటాన్ చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరిగా సాగనున్నాయి. పటాన్ చెరులో ఇంద్రేశం, గడ్డ పోతారం, మొత్తం ఐదు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతం మహా నగరానికి అనుకొని ఉండడంతో పాటు ఈ మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పడడంతో ఎన్నికల పోరు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగనుంది. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఐదు మున్సిపాలిటీలపై తమ జెండా ఎగరవేయడానికి పగడ్బందీ ప్రణాళికలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అయితే ప్రధానంగా అందరి దృష్టి పారిశ్రామిక వాడతో పాటు గృహ నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న ఇస్నాపూర్ మున్సిపాలిటీ పై పడింది. ఈ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఈ మున్సిపల్ చైర్మన్ సీటును కైవసం చేసుకోవడానికి ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. తమకు అవకాశం రాకపోయినా కనీసం తమ కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలబెట్టి ఈ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఈ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఎత్తులకు పై ఎత్తు వేస్తున్నారు.
మద్దతిస్తే ఖర్చంతా మాదే..
చైర్మన్ పీఠంపై కన్నేసిన కొందరు ప్రధాన నాయకులు సీటును కైవసం చేసుకునే దిశగా రాజకీయాలు మొదలుపెట్టారు. వార్డులలో గెలుపు గుర్రాలను అన్వేషించి మీరు గెలిస్తే చైర్మన్ గా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అందుకు ప్రతిఫలంగా ఈ ఎన్నికల్లో మీ ఖర్చు మొత్తం తామే భరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.నూతనంగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఇస్నాపూర్ తో పాటు చిట్కుల్, పాశం మైలారం, రుద్రారం, లక్డారం ఉండగా ప్రధానంగా మూడు గ్రామాల నేతలు చైర్మన్ పీఠం కోసం పోటీపడుతున్నారు. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులను ప్రసన్నం చేసుకుని చైర్మన్ పీఠంపై కూర్చునే ప్రయత్నాల్లో ఉన్నారు.
అధికార కాంగ్రెస్ లో ముగ్గురు నేతలు తమ కుటుంబ సభ్యులను చైర్మన్ పీఠంపై కూర్చుండబెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తమ పార్టీ అధికారంలో ఉండడంతో గెలుపు సులువని నమ్మిన నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చైర్మన్ సీటుపై ఆశపడుతున్న ఒక నేత తన భార్యకు చైర్మన్ గా మద్దతు ఇస్తే రూ.20 లక్షలు ఎన్నికల ఖర్చులకు ఇస్తానని ఆఫర్ చేయగా, మరొక నేత తన భార్యకు అవకాశం ఇస్తే ఒక్కొక్క కౌన్సిలర్ అభ్యర్థికి రూ.60 లక్షలు ఆఫర్ చేశారు. తన కూతురిని చైర్మన్ చేయాలని లక్ష్యంతో ఉన్న మరో నేత కౌన్సిలర్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు ఎంతతానే భరిస్తానని దగ్గరుండి గెలిపిస్తానని కౌన్సిలర్ అభ్యర్థులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో సైతం ఇస్నాపూర్ కు చెందిన ఒక మాజీ ప్రజా ప్రతినిధి చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తమ కౌన్సిలర్ అభ్యర్థుల ఖర్చులకు ఆర్థిక వనరులు సమకూరుస్తానని హామీ ఇస్తున్నారు.
రెండు పార్టీల మధ్య హోరాహోరీ..
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కష్టపడుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు దక్కించుకొని చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అభ్యర్థుల అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఒక్కొక వార్డులో ఇద్దరి నుంచి ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తుండడంతో ఎవరిని బరిలో దింపితే గెలుపు అవకాశాలుంటాయన్న కోణంలో సర్వేలు నిర్వహిస్తున్నాయి. రెండు పార్టీలు గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చి మున్సిపాల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు సైతం తగ్గేదెలే అన్న రీతిలో టికెట్ ఇస్తే ఓకే లేదంటే ఇండిపెండెంట్ గా నిలబడి తమ సత్తా చూపిస్తామని పార్టీ ఇన్చార్జిలకు తేల్చి చెప్తున్నారు. దీంతో ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు హోరా హోరీగా సాగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ముందే జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలోనే కాస్ట్లీ ఎన్నికలుగా మారతాయనడంలో సందేహం లేదు.






