- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ
శిలా ఫలకాలపై సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉన్న ప్రజల మనో ఫలకాల్లో బీఆర్ఎస్ ఉంటుందని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావు అన్నారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : శిలా ఫలకాలపై సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉన్న ప్రజల మనో ఫలకాల్లో బీఆర్ఎస్ ఉంటుందని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నర్మెట ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మందు చూపుతో అత్యంత ఆధునిక మలేషియా టెక్నాలజీతో, రిఫైనరీ యూనిట్ లో కలిపి రూ.300 కోట్లతో 62 ఎకరాల్లో నిర్మించినట్లు తెలిపారు. కాళేశ్వరం కూలేశ్వరం అని అబద్దాలు ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం జలాల వినియోగంతో నడిచే ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించడం శోచనీయమన్నారు. జిల్లాలో ఆయిల్ ఫాం సాగు కు కాళేశ్వరం జలాలే కీలకం అన్నారు.
శ్రమ మాది.. శిలాఫలాకాలు మీవి..!
కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకోవాలని చూసిన రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా కాళేశ్వరం జలాలను నెత్తిమీద జల్లు కొని పాప పరిహారం చేసుకోవాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ప్రారంభోత్సవాలు జరిపే సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఆయూష్ ఆసుపత్రి, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, జిల్లా జైలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేసినట్టు తెలిపారు. శ్రమ బీఆర్ఎస్ దీ అయితే శిలా ఫలకాలు సీఎం రేవంత్ రెడ్డివి అని అన్నారు. రుణామాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఓట్టు పెట్టి రైతులకు ఇచ్చిన హామీని నేటికి పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే నర్మెట గ్రామంలో 350 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. 3 దఫాలుగా రైతు భరోసా ఎగపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఏ పంటకు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నాడో రైతులకు చెప్పాలన్నారు. 3 పంటలకు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంటల భీమా అమలు చేయక పోవడంతో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజక వర్గంలో అర్ధంతరంగా రద్దు చేసిన రూ.1070 కోట్ల ( వెటర్నీరీ కాలేజీ, రంగనాయక సాగర్, కోమటి చెరువు టూరిజం అభివృద్ధి పనులు, ఔటర్ రింగ్ రోడ్డు, టూటౌన్, త్రీ టౌన్ పోలీసు స్టేషన్ నిర్మాణ పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సిద్దిపేట అల్లీ పూర్ ఫోర్ లైన్ ) పనులను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






