రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు : రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్

by Disha Web Desk 1 |
రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు : రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్
X

దిశ, మెదక్ ప్రతినిధి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అధికారులను అప్రమత్తం చేయడం పట్ల రైతులు కూడా ఆనందంగా ఉన్నారని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పై జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనాపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు చంద్రపాల్, డీఎస్వో శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ హనుమంత రెడ్డితో కలిసి సమీక్షించారు.

కంట్రోల్ రూంలో టీ.వీ ఏర్పాటు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ వార్తలకు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మెదక్ మండలం రాజ్ పల్లి లో ప్రాథమిక సహాకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను పరమార్శించి ఇక్కడ కేంద్రం నిర్వహణ తీరును తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైస్ మిల్లుల్లో కటింగ్ కాకుండా చూడాలని, ట్రక్ షీట్ వెంటనే జారీచేసి, టాబ్ ఎంట్రీ చేసిన 48 గంటల్లోగా రైతుల ఖాతాలో డబ్బు వేయాలని అధికారులను ఆదేశించారు.

ఇది రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ మదిలో ఎల్లపుడు రైతు సంక్షేమం పై ఆలోచిస్తూ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఉచిత విద్యుత్, సాగు నీరు అందించడం వల్ల 2014 లో 1,400 రైస్ మిల్లులుండగా నేడు 2,700 రైస్ మిల్లులు ఏర్పడ్డాయని అన్నారు. రైతులు కూడా, ఏడాదిలో 2, 3 పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారని, నేడు దేశంలో అత్యధికంగా వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ మారబోతుందని అన్నారు.

జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు, గోనె సంచుల కొరత రాకుండా మానిటరింగ్ చేస్తున్నదని, గోదాం సమస్య లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, వసతి గృహా విద్యార్థులకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నారని, అయితే బోరు బావి నీటితో కాక మంచినీటి తో అన్నం వండితే బాగుంటుందని ఆ దిశగా అధికారులు పాఠశాలలను సందర్శిస్తూ తనిఖీ చేస్తుండాలని అన్నారు.

టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట వంటి మండలాలకు బీదర్ దగ్గరగా ఉన్నందున ఎఫ్.సీ.ఐ. బియ్యాన్ని సనత్ నగర్ కు బదులు ఇక్కడకు తరలించుటకు ప్రతిపాదనలు పంపవలసినదిగా సూచించారు. హమాలీలకు ఇబ్బంది కలగకుండా గోదాంలో భోజనం చేయుటకు, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రతి రైస్ మిల్లరు ఒక పాఠశాలను దత్తత తీసుకోవాలని కోరారు.


Next Story

Most Viewed