సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

by Disha Web Desk 1 |
సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
X

మెరుపు ధర్నాతో అవాక్కైన పోలీసులు

రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలింపు

దిశ, కొండపాక: సీఎం కేసీఆర్ సోంత నియోజకవర్గమైన గజ్వేల్ లోని కొండపాక మండల పరిధిలోని బందారం, బంధారం దర్గా, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మండలంలోని దుద్దెడ, వేలికట్ట చౌరస్తాల్లో వేరువేరుగా రాస్తారోకో నిర్వహించారు. ధర్నా చేస్తారని ముందస్తు సమాచారం పోలీసులకు నాయకులు చేరవేశారు. దీంతో పోలీసులు రైతులు రోడ్డు ఎక్కకుండా బందారం సబ్ స్టేషన్ వద్ద పోలీసు వ్యాన్ తో భారీ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసుల కళ్లు గప్పి రైతులు దుద్దేడకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు దుద్దేడకు చేరుకొని రైతులను అరెస్టు చేసి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొంతమంది రైతుల అరెస్టును నిరసిస్తూ కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలికట్ట చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపి పోలీసులకు సవాల్ విసిరారు. ధర్నా చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న త్రీటౌన్ పోలీసులు ఆగమేఘాల మీద చేర్యాల చౌరస్తాకు చేరుకొని ధర్నా చేస్తున్న రైతులను అరెస్టు చేసి కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రైతులు పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. మేము కేసీఆర్ కు ఓట్లు వేయలేదా మాకెందుకు సాగునీరివ్వరని పోలీసులపై మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు అరెస్టులకు భయపడేది లేదని, సాగునీరు అందే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు తెగేసి చెప్పారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు కావాలో.. లేక పార్టీ కావాలో తేల్చుకోవాలని రైతులు తెలిపారు. తక్షణమే మా గ్రామాలకు సాగునీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు.

నాయకులను పెట్టి పార్టీలకు అతీతంగా తాగునీరు వచ్చేంత వరకు ఏదో రకంగా ఉద్యమాలు చేపడతామని రైతులు అన్నారు. గత ఎనమిదేళ్ల నుంచి తాపస్ పల్లి దేవాదుల లిస్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ నుంచి నీరు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తూ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. తపాస్ పల్లి నుంచి మర్పడగ వరకు కాలువను తవ్వి వదిలేశారని తెలిపారు. మూడేళ్ల క్రితం కాలువ పనులు ప్రారంభించినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదన్నారు.

కొండపాక మండలంలో నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీటిని అందిస్తామని నాయకులు ఎన్నోసార్లు రైతులకు చెప్పారని గుర్తు చేశారు. అయినా, ఇప్పటి వరకు కాలువ నిర్మాణం పనులు ప్రారంభించడం లేదంటూ బందారం చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు అందిస్తున్నప్పటికీ సీఎం నియోజకవర్గంలోని మూడు గ్రామాలకు నీరు అందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించాలని పలువురు రైతులు నాయకులను కోరారు. ధర్నా చేస్తామని అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జండా ఆవిష్కరించి.. గజ్వేల్ సభకు తరలించేందుకు నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు.

ధర్నా చేయకుండా సభకు పోవడమేంటని పలువురు రైతులు నాయకులు నిలదీసినప్పటికీ నాయకులు ధర్నాకు తరలి వెళ్లారు. అనంతరం రైతులు దుద్దెడ గ్రామంలో ధర్నా నిర్వహించిన అనంతరం వెలుకట్ట చౌరస్తా వద్ద రెండోసారి ధర్నా నిర్వహించి పోలీసులకే సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు శ్రీనివాస్ కర్ణాకర్ రెడ్డి, అంకిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, ఉప సర్పంచ్ నరసింగరావు, పాలడుగు చంద్రారెడ్డి, మిట్టపల్లి రాజు, కట్ట రాజు వార్డు సభ్యులు, నీర సత్యం, బట్ట పరశురాములు, శనిగరం మల్లయ్య, నీల వెంకటేష్, వేణు చింతల యాదగిరి, పరశురాములు, శ్రీనివాస్, యాదగిరి, కిషన్ రావు, నరసింహులు, తిరుమల్ రెడ్డి, శ్రీకాంత్, ఆయా గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు



Next Story

Most Viewed