గూడెం హవాకు బ్రేక్? కాంగ్రెస్ అధిష్టానం యాక్షన్ ప్లాన్ ఇదే!

by Naga Rani Yarlagadda |

పటాన్ చెరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారడంతో తమకు తీవ్రనష్టం జరిగినట్లు కాంగ్రెస్ భావిస్తోంది.

గూడెం హవాకు బ్రేక్? కాంగ్రెస్ అధిష్టానం యాక్షన్ ప్లాన్ ఇదే!
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: పటాన్ చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల తరువాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరడం, సెగ్మెంట్ లో ఐదు మున్సిపాలిటీను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి. ఎప్పుడొచ్చామని కాదు.. బుల్లెట్ దిగిందా..? లేదా..? అని మహిపాల్ రెడ్డి వేసిన డైలాగ్ నేరుగా వెళ్లి కాంగ్రెస్ అధిష్టాన్ని తగిలింది. ఆయనను వద్దంటే కాంగ్రెస్ చేర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆ బుల్లెట్ దిగిందని స్వయంగా సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. గూడెం పార్టీలకు రావడంతో రెండేళ్లలో కాంగ్రెస్ కు చాలా నష్టం జరిగిందని, సెగ్మెంట్ లో మొత్తం ఆయన తీసుకువచ్చిన అధికారులే ఉన్నారని, స్థానిక కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఈ వరుస పరిణామాలతో పార్టీ అధిష్టానం చర్యలకు పూనుకోనున్నట్లు తెలుస్తోంది. మొదటగా అధికారుల బదిలీ చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో అధికారుల్లో భయం మొదలైంది.

"బుల్లెట్" డైలాగ్ పై అధిష్ఠానం సీరియస్

నియోజకవర్గంలో ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇద్రేశం.. ఐదు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడారు. మున్సిపల్ ఎన్నికల్లో నేరుగా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, మహిపాల్ రెడ్డి, పార్టీ నియోకజవర్గ ఇన్ చార్జి ఆదర్శరెడ్డి, ఇతర నేతలంతా వ్యూహాత్మకంగా వ్యవహరించి మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. కాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓటుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ ను తమ వైపు తిప్పుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు. తమ పార్టీ కౌన్సిలర్ తో మున్సిపాలిటీని కాంగ్రెస్ కు రాకుండా చేయడాన్ని కూడా అధిష్టానం సిరియస్ గా తీసుకున్నది. ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తరువాత ‘బుల్లెట్ దిగిందా లేదా’..? అని మహిపాల్ రెడ్డి డైలాగ్ వేశారు. ఆ డైలాగ్ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ డైలాగ్ తోనే అధిష్టానం పటాన్ చెరు పాలిటిక్స్ పై దృష్టి సారించేలా చేసిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

నేతల ఫిర్యాదుతో రంగంలోకి అధిష్ఠానం

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరారు. అయితే ఆ సమయంలో జిల్లాకు చెందిన మంత్రితో పాటు పటాన్ చెరు పార్టీ ఇన్ చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ ఇన్ చార్జి నీలం మధు ముదిరాజ్, ఇతర నేతలు ఆయన చేరికను వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. ఎవరి వాదనలను పట్టించుకోకుండా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మహిపాల్ రెడ్డి తన సన్నిహితులతో కలిసి కాంగ్రెస్ లో చేరిపోయారు. అలా చేరిన వెంటనే ఆయన నియోజకర్గంలోని పటాన్ చెరు, జిన్నారం, గుమ్మడిదల, రామచంద్రాపురం మండలాలు, తెల్లాపూర్, బొల్లారం, అమీన్ పూర్ మున్సిపాలిటీలలో రెవెన్యూ, ఇగిరేషన్, పోలీసు శాఖల్లో తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టులు ఇప్పించారని చెబుతున్నారు. ఈ క్రమంలో రెండేళ్లపాటు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో మహిపాల్ రెడ్డి హవా కొనసాగించారు. ఏరికోరి అందరూ వద్దన్నప్పటికీ పార్టీలో చేర్పించుకుని కాంగ్రెస్ అధిష్టానం సాధించింది ఏమిటని..? పటాన్ చెరు కాంగ్రెస్ నాయకులు అధిష్టాన పెద్దలను నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం.

పీసీసీ చీఫ్ వ్యాఖ్యలతో రాజకీయంగా ఆసక్తి

మహిపాల్ రెడ్డి పార్టీలో చేరడం ద్వారా వచ్చిన లాభమేమిటని కాంగ్రెస్ నాయకులు అధిష్టానం పెద్దలను నిలదీసినట్లు తెలుస్తోంది. మీరే చేర్చుకున్నారు.. పటాన్ చెరులో మీరే కాంగ్రెస్ ను ఆగం చేశారని స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ పరిణామాలు, మహిపాల్ రెడ్డి బుల్లెట్ డైలాగ్ తో మీడియా ముందు మహేష్ కుమార్ గౌడ్ స్పందించిన విషయం తెలిసిందే. పటాన్ చెరు వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, బుల్లెట్ ఎవరికి దిగిందో తెలుస్తుందని ఒకింత ఆయన హెచ్చరికలు చేశారు. గూడెం చేరిక విషయంలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి తీరును కూడా పటాన్ చెరు కాంగ్రెస్ వర్గాలు తప్పుపడుతున్నాయి.

అధికారుల బదిలీలకు రంగం సిద్ధం

పటాన్ చెరు నియోజకవర్గ పరిదిలోని పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల్లో ఆయనకు అనుకూలంగా ఉంటున్న అధికారులను బదిలీ చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వారంలో ఎప్పుడైనా బదిలీ ఉత్తర్వులు రావచ్చునని చెబుతున్నారు. ప్రధానంగా పోలీస్, రెవెన్యూ శాఖల్లోని అధికారులను టార్గెట్ చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పడు కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెట్టిన అధికారులనే ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిన తరువాత తిరిగి ఇక్కడకే పోస్టుంగులు ఇప్పించుకున్నారని కాంగ్రెస్ నాయకులు అధిష్టానం వివరించారు. రెండేళ్లు ఆయనే అనుకున్నదే చేశారని, తాము ఉత్సవ విగ్రహాల మాదిరిగా మారిపోయామంటున్నారు. వ్యూహాత్మకంగా గూడెం వర్గం కాంగ్రెస్ ను రెండేళ్లలో కోలుకోని దెబ్బతీసిందని వివరించినట్లు తెలిసింది. "గూడెం"తో పాటు ఆయన వర్గంపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరడంతో ఆ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. అయితే ఏవరు బదిలీ కానున్నారోనని ఆయా శాఖల్లో అధికారుల్లో భయం మొదలైంది. మున్ముందు రాజకీయ పరిణామాలు ఎలా మారనున్నాయో వేచి చూడాల్సి ఉన్నది.

Next Story