- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా కేంద్రంలో ఖరీదైన భూమిపై బడా నేత కన్ను!
అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.కోట్లు విలువ చేసే సాగు భూమి పై కన్నేశాడు.

దిశ, సిద్ధిపేట ప్రతినిధి: అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.కోట్లు విలువ చేసే సాగు భూమి పై కన్నేశాడు. అన్నదమ్ముల తగాదాలో తలదూర్చిన సదరు నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుటుంబంలో కొందరు అమ్ముకున్న భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైత్రి వనం కాలనీకి ఎదురుగా వరంగల్ కు చెందిన రాగం మల్లయ్యకు సర్వే నెంబర్ 974, 975, 978, 979లలో సుమారు 37 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. ఆయనకు ఐదుగురు కొడుకులు. రెండో కుమారుడు రాగం ఎల్లయ్య వాటాగా సిద్దిపేటలో సదరు సర్వే నెంబర్లలో 14 ఎకరాలు ఇచ్చాడు. మిగతా నలుగురు కుమారులకు వరంగల్‌లోని ఆస్తులతో పాటు సిద్దిపేటలో మిగిలిన సుమారు 23 ఎకరాల భూమిని రాసిచ్చారు.
అన్నదమ్ముల భూ వివాదం..
రాగం ఎల్లయ్య నుంచి నలుగురు కుమారులకు వాటాగా సంక్రమించిన భూమిలో కొంత భాగాన్ని 30 ఏండ్ల కిందటే అమ్ముకున్నారు. వారి నుంచి కొన్నవారు వారు ప్రస్తుతం అట్టి భూమిలో నివాస సముదాయాలు నిర్మించుకున్నారు. ఈ విషయాన్ని రాగం ఎల్లయ్య వారసులు రాగం సుజాత, రాగం రాధ, రాగం మోహన్, రాగం శ్రీనివాస్ ధ్రువీకరించారు. మిగిలిన సుమారు 8 ఎకరాల పైచిలుకు భూమిలో రాగం ఎల్లయ్య వారసులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య పంచాయతీ నెలకొనగా హైకోర్టును ఆశ్రయించారు.
కీలక నేత కన్ను..
అమ్మిన భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో అమ్మిన వారి పేర్లే ఇంకా కొనసాగుతుండటాన్ని అదునుగా భావించి అన్నదమ్ముల పంచాయతీ వివాదంలో తలదూర్చిన జిల్లా కాంగ్రెస్ నేత వారి పేరిట రికార్డుల్లో ఉన్న భూమి 18 ఎకరాలను తన అన్న కుమారుడు వాటా దారుడిగా కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. అలా దాయాదుల వివాదంలోకి తలదూర్చిన సదరు అధికార పార్టీ కీలక నేత.. సాగు చేసుకుంటున్న వారి పేర్లను భూ రికార్డుల్లో నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకున్నదే తడవుగా అధికారుల అండదండలతో సాగు చేసుకుంటున్న వారికి నోటీసులు సైతం జారీ అయ్యాయి. దీంతో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాగం ఎల్లయ్య వారసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, అధికార పార్టీ నాయకులు ఆ భూమిని దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సదరు అధికార పార్టీ కీలక నేత భూ ఆక్రమణ యత్నాల నుంచి తమకు రక్షణ కల్పించాలని రాగం ఎల్లయ్య వారసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- Tags
- siddipet






