ట్యాంకర్లతో నీటి సరఫరా చేయండి.. గోదావరి మెయిన్ పైపులైన్ లీకేజీపై ఎండీ ఫోకస్‌

by Ramesh Naini |

హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలోని శ్రీనివాస్‌నగర్ బ్రిడ్జి వద్ద 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌లో ఏర్పడిన లీకేజీపై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

ట్యాంకర్లతో నీటి సరఫరా చేయండి.. గోదావరి మెయిన్ పైపులైన్ లీకేజీపై ఎండీ ఫోకస్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలోని శ్రీనివాస్‌నగర్ బ్రిడ్జి వద్ద 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌లో ఏర్పడిన లీకేజీపై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. లీకేజీ నివారణ, మరమ్మతుల పురోగతిపై జలమండలి ఈడీతో కలిసి ఉన్నతాధికారులతో తాజాగా జూమ్ మీటింగ్ నిర్వహించి, పనులను వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌, ట్రాన్స్‌మిషన్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. లీకేజీ కారణంగా నీటి సరఫరా నిలిచిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్యాంకర్ల ద్వారా నిరంతరంగా నీరు సరఫరా చేయాలని సూచించారు. ప్రతి జీఎం తన పరిధిలో యాక్షన్ ప్లాన్ రూపొందించి, ప్రభావిత ప్రాంతాలు, కనెక్షన్ల సంఖ్యపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.

24 గంటలూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

మరమ్మతు ప్రాంతంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 24 గంటలూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధంగా ఉండాలని, నీటి సరఫరా అంతరాయం విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. లైన్‌మెన్లు, మీటర్ రీడర్ల సహాయంతో స్థానికులకు సమాచారం అందించాలని, స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి నీటి నిల్వపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే పైపులైన్ డీ-వాటరింగ్ పనులు పూర్తి చేసి వెల్డింగ్ పనులు ప్రారంభించినట్లు అధికారులు ఎండీకి వివరించారు. ఈ వెల్డింగ్ పనులు సాయంత్రం 4 గంటలకల్లా పూర్తి చేసి, మొత్తం మరమ్మతులను 03.01.2026 శనివారం రాత్రి 12 గంటలలోపు అంటే 18 గంటల్లో ముగించేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

నిర్ణీత సమయంలో పునరుద్ధరించాలి

నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకోవాలని, గంటగంటకు పనుల పురోగతిని సమీక్షిస్తూ మైక్రో లెవల్లో ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సంపులు, స్టోరేజీ సామర్థ్యం ఉన్న ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని, ఈ సమయంలో నీటి వృథాను అరికట్టి పొదుపుగా వినియోగించాలని జలమండలి ప్రజలను కోరింది.

Next Story