గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు సెంటర్ ఓపెన్: Minister Harish Rao

by Disha Web Desk 19 |
గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు సెంటర్ ఓపెన్: Minister Harish Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు సెంటర్ ప్రారంభమైంది. రూ.52 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు 33 నియోనాటల్ అంబులెన్స్‌లు, రూ.1.2 కోట్లతో ఆధునికరించిన డైట్ కిచెన్‌ను మంత్రి హరీష్​రావు ఆదివారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్​రావు మాట్లాడుతూ.. మాతా, శిశు మరణాలను మరింత తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మూడు మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ (ఎంసీహెచ్‌) నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. నిమ్స్‌లో, అల్వాల్‌లో నిర్మిస్తున్న టిమ్స్‌‌లో, గాంధీలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

ఈ 600 పడకలు మాత, శిశు క్రిటికల్ కేర్‌లకు ఎక్స్ క్లూజీవ్‌గా పనిచేస్తాయన్నారు. మాతా, శిశువులకు అన్ని రకాల మల్టీపుల్‌ వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉండనున్నాయన్నారు. ప్రసవం సమయంలో, ఆ తర్వాత మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పాటు పుట్టిన శిశువు ఆరోగ్య సంరక్షణ సేవలు ఈ ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో అందుతాయన్నారు. గర్భిణులకు డయాలసిస్‌ సేవలు కూడా ఏర్పాటు చేశామన్నారు. గుండె, కిడ్నీ, కాలేయం, న్యూరో తదితర మల్టిపుల్‌ వ్యాధులతో బాధపడే తల్లులకు, పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల సమస్యలతో బాధపడే శిశువులకు ఈ ‘మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌’ సెంటర్‌లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుతుందన్నారు.

వెంటిలేటర్లు, గుండె పరీక్షల కోసం 2డీ-ఎకో యంత్రాలు, కొల్పోస్కోపి, ల్యాపరోస్కోపి వంటి హై ఎండ్ ఎక్విప్ మెంట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎంసీహెచ్ కేంద్రంతో గాంధీలోనే 500 బెడ్లతో మాతా, శిశు ఆరోగ్యం కోసం అందుబాటులో ఉంటాయన్నారు. మరోవైపు నవజాత శిశువులను అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు చేరవేసి తద్వారా సకాలంలో చికిత్స అందించేందుకుగాను నియోనాటల్ అంబులెన్స్‌లను కూడా ప్రారంభించామన్నారు. వైద్యారోగ్యశాఖలోని ఏ పారామీటర్ తీసుకున్నా.. దేశంలోని రికార్డులన్నీ మనకే దక్కుతున్నాయని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed