మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోండి..! డీజీపీ శివధర్ రెడ్డి లాస్ట్ కాల్

by Kema Shiva Kumar |

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. అగ్రనేత గణపతి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన సరెండర్ అయితే ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోండి..! డీజీపీ శివధర్ రెడ్డి లాస్ట్ కాల్
X

దిశ, వెబ్‌డెస్క్: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హింసా మార్గాన్ని విడనాడి, జనజీవన స్రవంతిలో కలిసి గౌరవప్రదమైన జీవితం కొనసాగించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు అగ్రనేత గణపతి (Ganapati) అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు ఆరోగ్యం క్షీణించిందని తమకు సమాచారం ఉందని వెల్లడించారు. ‘గణపతి గారు వెంటనే లొంగిపోవాలి. ఆయన లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతోనే పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం అందిస్తాం’అని భరోసానిచ్చారు. గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న మరో ఏడుగురు ముఖ్య నేతలు కూడా వెంటనే లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరికీ పునరావాసం కల్పించాం..

గత రెండేళ్ల కాలంలో సుమారు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. సరెండర్ అయిన ప్రతి ఒక్కరికీ హోదాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం తరపున అన్ని రకాల ప్రయోజనాలతో పాటు మెరుగైన పునరావాసం కల్పించామని ఆయన గుర్తు చేశారు. ఆయుధాలు వీడి వస్తే, సమాజంలో తలెత్తుకుని జీవించేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. కాగా, మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి మరోసారి మీడియా ద్వారా స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Next Story