- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యమానికి ప్రజాపునాది లోపించింది.. వెలుగులోకి మావోయిస్టు పొలిట్‌బ్యూరో కీలక సర్క్యులర్
ఉద్యమానికి ప్రజాపునాది లోపించింది.. వెలుగులోకి మావోయిస్టు పొలిట్‌బ్యూరో కీలక సర్క్యులర్

దిశ, వెబ్‌డెస్క్: భారత విప్లవ ఉద్యమానికి అవసరమైన ప్రజాపునాది గణనీయంగా బలహీనపడిందని మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో (Maoist Party Politburo) విడుదల చేసిన కీలక సర్క్యులర్‌లో అంగీకరించింది. 2020 నుంచి 2024 వరకు ఉద్యమ పరిస్థితులపై చేసిన సమీక్షలో, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల వరుస ప్రతిఘాత దాడులు, భద్రతా శిబిరాల విస్తరణ, భారీ బలగాల మోహరింపుతో ప్రజా మద్దతు తగ్గిందని స్పష్టం చేసింది. ‘సమాధాన్’, ‘సూరజ్‌కుండ్’ వ్యూహాల అనంతరం 2024 నుంచి అమలవుతున్న ‘కగార్’ నిర్ణాయక దాడులు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపాయని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ కాలంలో పార్టీ నాయకత్వం నుంచి కింది స్థాయి వరకు మరణాలు, అరెస్టులు, లొంగిపోవడం చోటుచేసుకోవడంతో పార్టీ, సాయుధ దళాల బలం తగ్గిందని వెల్లడించింది. అటవీ ప్రాంతాల్లో కార్పెట్ సెక్యూరిటీ విస్తరణతో ఉద్యమ ప్రాంతాలు కుదించబడ్డాయని పేర్కొంది.
పట్టణ, సమతల ప్రాంతాల్లో రాజకీయ–సంస్థాగత కార్యకలాపాలు బలహీనపడటం, ప్రజా ఉద్యమాలను పార్టీ, సాయుధ పోరాటంతో సమర్థంగా అనుసంధానం చేయలేకపోవడం వల్ల ప్రజాపునాది మరింత క్షీణించిందని స్వీయ విమర్శ చేసింది. రహస్య పని పద్ధతుల్లో లోపాలు, శత్రు గూఢచర్యాన్ని నియంత్రించడంలో విఫలం కావడం కూడా ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే, ప్రజా సమస్యలపై ఆందోళనలు, ప్రచార కార్యక్రమాలు, కొన్ని ప్రాంతాల్లో గెరిల్లా చర్యలు కొనసాగినప్పటికీ, అవి ఉద్యమాన్ని ముందుకు నడిపే స్థాయిలో లేవని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో పార్టీని, సాయుధ దళాలను, యునైటెడ్ ఫ్రంట్‌ను, మొత్తం విప్లవ ఉద్యమాన్ని కాపాడుకోవడమే తక్షణ ప్రధాన లక్ష్యమని పొలిట్‌బ్యూరో ప్రకటించింది.
భవిష్యత్ వ్యూహంగా ప్రజా ఉద్యమాలను మళ్లీ బలోపేతం చేయడం, పట్టణ–సమతల ప్రాంతాల్లో రాజకీయ పని పెంచడం, చిన్న స్థాయి వికేంద్రీకృత చర్యలపై దృష్టి పెట్టడం, సిద్ధాంత–సంస్థాగత లోపాలను సరిదిద్దేందుకు ఎడ్యుకేషన్–రెక్టిఫికేషన్ కార్యక్రమాలు చేపట్టాలని సర్క్యులర్ సూచించింది. ఈ కాలంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిఘాత యుద్ధానికి ఎదురుగా జరిగిన చర్యల్లో కేంద్ర కమిటీ (CC) స్థాయి నుంచి సాధారణ విప్లవ ప్రజల వరకు మొత్తం 683 మంది మరణించారని, వారిలో 190 మంది మహిళలని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.
2021 జనవరి నుంచి మావోయిస్టు పార్టీ నాయకత్వానికి తీవ్ర నష్టాలు వాటిల్లాయని పొలిట్‌బ్యూరో సర్క్యులర్‌లో వెల్లడైంది. కేంద్ర కమిటీ (CC)కి చెందిన నలుగురు సభ్యులు — లక్ము, అంబర్, సాకేత్, ఆనంద్ — అనారోగ్య కారణాలతో మృతి చెందగా, మరో సభ్యుడు దీపక్ శత్రు దాడిలో మరణించినట్లు పేర్కొంది. అలాగే, కిషన్, శీలా, కాంచన్, కృష్ణమూర్తి, మాంగ్టు, జస్పాల్, మోహిత్, జనార్ధన్, కిషోర్ అనే తొమ్మిది మంది కీలక నేతలు అరెస్టయ్యారని వెల్లడించింది. దీంతో పార్టీ నాయకత్వ నిర్మాణం గణనీయంగా బలహీనపడిందని అంగీకరించింది.
ఇదే సమయంలో పార్టీ లైన్‌పై దాడి చేయడం, పార్టీ ఆచరణను దెబ్బతీయడం, విఘాతం సృష్టించే ధోరణితో వ్యవహరించారన్న కారణాలతో కేంద్ర కమిటీ సభ్యులు కొబాద్ గాంధీ, బచ్చా ప్రసాద్ సింగ్‌లను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. ప్రస్తుతం తూర్పు ప్రాంతంలో పరిమిత సంఖ్యలోనే నాయకత్వం మిగిలి ఉందని, కేంద్ర ప్రాంతంలోనూ అదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు కేంద్ర కమిటీ నేరుగా మార్గనిర్దేశం చేయలేని పరిస్థితి ఏర్పడిందని సర్క్యులర్ స్పష్టం చేసింది. అదేవిధంగా తూర్పు, కేంద్ర ప్రాంతాల మధ్య సమన్వయం పూర్తిగా లేకపోవడంతో పాటు, దేశవ్యాప్తంగా విప్లవ ఉద్యమానికి సంబంధించిన కేంద్రస్థాయి సమన్వయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని పొలిట్‌బ్యూరో స్వీయ విమర్శ చేసింది.






