భూమి లేకున్నా క్రయవిక్రయాలు.. ధరణిలో అసలు సమస్య ఉత్పన్నమవుతున్నది అక్కడే!

by Disha Web Desk 2 |
భూమి లేకున్నా క్రయవిక్రయాలు.. ధరణిలో అసలు సమస్య ఉత్పన్నమవుతున్నది అక్కడే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్‌లో ఆటోమెటిక్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌తో అనేక వివాదాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం పరిహారమిచ్చి నేషనల్, స్టేట్ హైవేస్.. ఔటర్ రింగ్ రోడ్డుల కోసం సేకరించిన భూములకూ.. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా కొత్త పాస్ బుక్కులు జారీ అయ్యాయి. అయితే పొషెషన్ లో లేకపోయినా రికార్డుల్లో భూమి ఉంటుండడంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అక్రమార్కులు.. ఆ సర్వే నంబరులో ఏదో మూలన భూమిని చూపించి మరొకరికి అమ్మేస్తున్నారు. ఆ కొన్న వారు ఆ భూమి తమదంటూ ఇతరులతో గొడవకు దిగుతున్నారు. దీంతో పొషెషన్ లో ఉన్న రైతులు కేసుల పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు రంగారెడ్డి, మేడ్చల్‌లో అధికంగా చోటుచేసుకుంటున్నాయి.

అస్తవ్యస్త డేటాతో కష్టం

భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత పార్ట్ ఏ, పార్ట్ బి అంటూ అనేక చిక్కుముళ్లు వేశారు. ఇక పీఓబీ సంబంధిత అంశాలు లక్షల్లోనే ఉన్నాయి. ప్రతి ఊరిలోనూ ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ (సేత్వార్ కంటే అదనం) చాలా ఉన్నది. ఒక్కో రెవెన్యూ విలేజ్ లో 10 నుంచి 20 శాతం విస్తీర్ణం పెరిగింది. గతంలో రైతులు భూమి అమ్మేసినా రికార్డుల్లో అలాగే కొనసాగించడం మూలానా తిరిగి సేల్ డీడ్స్ చేశారు. అసలు భూమి లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో వారంతా పొషెషన్ కోసం అదే సర్వే నంబరులోని రైతులతో గొడవ పడుతున్నారు. అర్బన్, రూరల్ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా ఈ సమస్య ఉత్పన్నమైంది. వాస్తవం కంటే లక్షలాది ఎకరాల విస్తీర్ణం పెరిగిందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అందుకే టీఎం 33 కింద వచ్చిన అప్లికేషన్లన్నింటినీ పెండింగ్ లేదా తిరస్కరణకు గురవుతున్నాయి. కేవలం ఆర్ఎస్ఆర్ తేడా అంటూ తిప్పి పంపిస్తున్నారు.

ఆఖరికి పొషెషన్ లో ఉన్న రైతుల విస్తీర్ణం, సర్వే నంబర్లను కూడా సరి చేయడం లేదు. ఆ సర్వే నంబర్ లో అమ్మేసినా రికార్డుల్లో కొనసాగుతున్న వారికి బదులుగా అసలైన వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇదంతా రికార్డుల్లోని డేటా ప్రకారం సేల్ డీడ్, మ్యుటేషన్ చేయడం వల్లనే అన్నది నిర్వివాదం. అదే సేల్ డీడ్ లేదా మ్యుటేషన్ కి ముందే ఎంక్వయిరీ చేసి ఉంటే పొషెషన్ లో ఉన్నదెవరు? విక్రయిస్తున్నదెవరు? అన్న విషయం బయటపడేది. అస్తవ్యస్తమైన రెవెన్యూ డేటాతో ఆటోమెటిక్ మ్యుటేషన్ సాధ్యం కాదని రిటైర్డ్ రెవెన్యూ అధికారి పరశురాంరెడ్డి ‘దిశ’కు వివరించారు. వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే మ్యుటేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆటోమెటిక్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అనేది గొప్ప అనిపించుకుంటుంది. కానీ అసలు భూమే లేకుండా ట్రాన్సక్షన్స్ జరిగితే భవిష్యత్తులోనూ అనేక వివాదాలు ముసురుతాయని ధరణి కమిటీ కూడా గుర్తించాలని కోరారు. 70 శాతం వరకు పొషెషన్ కరెక్టుగా ఉన్న భూములు ఉన్నాయి. అలాంటి రైతుల భూముల క్రయ విక్రయాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. రికార్డుల్లో వివాదాలు తెలుసుకునే అవకాశాలు తక్కువే.

ఇద్దరమే ఉన్నామంటే..

మా తండ్రికి మేం ఇద్దరమే కొడుకులం అంటూ సెల్ఫ్ డిక్లరేషన్ అప్ లోడ్ చేస్తే ఆటోమెటిక్ గా సక్సెషన్ చేసే వ్యవస్థ ఇది. నిజానికి మరొక వారసుడు/వారసురాలు ఉన్నారన్న విషయాన్ని దాచి పెట్టినా తహసీల్దార్ గుర్తించే ఆస్కారమే లేదు. కొందరు పట్టణాలు, ఇతర ప్రాంతాలకు వలసపోయిన వారుండొచ్చు. కానీ స్థానికంగా ఉండే వారే కుమ్మక్కయి తాము మాత్రమే వారసులమని నిర్ధారిస్తే విరాసత్ చేసి పాసు పుస్తకాలు చేతిలో పెట్టాల్సిందే. ఆ తర్వాత తానూ వారసుడినంటూ ఆఫీసుకొస్తే సివిల్ కోర్టుకు వెళ్లి ఆర్డర్ కాపీ తీసుకురావాల్సిందేనని సూచించడం మినహా న్యాయం చేసేందుకు అధికారులకు ఎలాంటి అధికారం లేదు. భూముల విలువలు అమాంతంగా పెరిగిన తర్వాత ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అత్తామామలు భూమి అమ్మేస్తుంటే 20 ఏండ్ల క్రితం పెళ్లి చేసుకున్న అల్లుడు తనకు వాటా వస్తుందంటూ గొడవలు పెట్టుకొని కేసుల పాలవుతున్న తరుణమిది. అందుకే సెల్ఫ్ డిక్లరేషన్ పై విచారణ చేయకుండానే ఆమోదించడం ద్వారా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

ఏదైనా కన్వర్షన్

నాలా కన్వర్షన్ లోనూ ఎలాంటి విచారణ అవసరం లేదని ధరణి పోర్టల్ ఆప్షన్ చెప్తున్నది. పాస్ బుక్ ద్వారా అప్లయ్ చేసి, సంబంధిత ఫీజు చెల్లిస్తే చాలు.. వెంటనే నాలా కన్వర్షన్ చేస్తున్నారు. నిజానికి ఆ భూమి ఎక్కడుంది? ఎఫ్టీఎల్, నాలాలు, చెరువులు, కుంటలు.. ఇలాంటివేవీ పరిశీలించాల్సిన అవసరం లేకుండానే ఫీజు చెల్లింపు ద్వారా ఈజీగా నాలా కన్వర్షన్ చేయడంతో ఇబ్బందే. ఇప్పటికే చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు మాయమవుతున్నాయి.

ప్రజల్లోనూ భయం..

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మ్యుటేషన్ బాధ్యతలను రెవెన్యూ ఉద్యోగులకు అప్పగిస్తే ఎంత ఇబ్బంది పెడతారోనన్న భయం కూడా జనంలో ఉన్నది. ఆటోమెటిక్ మ్యుటేషన్ లేకపోతే దానికి కూడా కొర్రీలు పెట్టి లంచాలు తీసుకునే అవకాశం ఉందని ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వాపోయారు. ఇలాంటి సమస్య తాను ఎదుర్కొన్నానని చెప్పారు. రెవెన్యూ అధికారులను సంప్రదించే వ్యవస్థను రూపొందించాల్సి వస్తే అవినీతికి తావు లేని విధానాన్ని రూపొందించాలన్నారు. ప్రతి పని నిర్దిష్ట సమయంలోనే పూర్తి చేసేటట్లుగా కాల పరిమితిని విధించాలన్నారు. ఆటోమెటిక్ వ్యవస్థ లేకపోతే లంచాలు తీసుకుంటున్నారన్న అపవాదు ఉద్యోగులపై పడుతుందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడొకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వీఆర్వోలపై అవినీతి ముద్ర వేశారని వాపోయారు.

ఎన్నో కేసులు

– రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడలో ఓ రైతు 17 గుంటల భూమిని 2005లో అమ్మేశాడు. ఆయన మ్యుటేషన్ కూడా చేయించుకున్నారు. కానీ అదే భూమిని ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత హైదరాబాద్ కు చెందిన మరొకరు వ్యక్తి మ్యుటేషన్ చేయించుకున్నారు. తాను ఎవరికీ మిగతా భూమిని అమ్మలేదని, ఎక్కడా సంతకాలు చేయలేదని బాధితుడు వాదించాడు. తనకు తెలియకుండానే ఎలా మ్యుటేషన్ చేశారని అధికారులను నిలదీశాడు. ఆఖరికి ఆయన సమర్పించిన డాక్యుమెంట్ల కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే అలాంటి పత్రాలేవీ లేవని పేర్కొన్నారు. మరి ఎలా మ్యుటేషన్ చేశారంటూ కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లకు 34 అప్లికేషన్లు ఇచ్చారు. ఏ ఒక్క అధికారి నుంచి చోటు చేసుకున్న తప్పిదాన్ని అంగీకరించడం లేదు. బాధితుడే ఈసీ పరిశీలిస్తే తానే విక్రయించినట్లుగా పేర్కొన్నారు. సేల్ డీడ్స్ సంపాదించగా మొదట కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లుగా ఆధారాలు లభించాయి. రెవెన్యూ అధికారులు మాత్రం వీళ్ల భూమిని ఆయన పేరిట రాసిచ్చారు. ఈ తతంగమంతా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే చోటు చేసుకున్నది. ఇప్పుడేం చేయాలో అధికారులెవరూ చెప్పడం లేదు.

– ఆలేరుకు చెందిన ఓ వ్యక్తికి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వీరవల్లిలో కొంత భూమి ఉన్నది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పట్టాదారు పాసు పుస్తకం కూడా జారీ అయ్యింది. రైతుబంధు సొమ్ము ఖాతాలో డిపాజిట్ కావడం లేదని తెలుసుకుంటే తన పేరిట ఉన్న భూమి పక్క సర్వే నంబరు పట్టాదారుడైన మరొకరి పేరిట నమోదు చేశారు. ఎలాంటి క్రయ విక్రయాలు జరగలేదు. సంతకాలెక్కడా పెట్టలేదు. కానీ రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి రూ.కోటికి పైగా విలువజేసే భూమిని పట్టాదారుడికే తెలియకుండా మరొకరి పేరిట రాసేశారు. ఆయనెవరో కూడా పట్టాదారుడికి తెలియదు. క్రయ విక్రయాలకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. తన భూమిని తిరిగి ఇప్పించాలంటూ రెండేండ్లు తిరిగారు. ఇలాంటి సంఘటనలు అనేకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి.

ధరణి కమిటీ సిఫారసులపై ఆసక్తి

స్లాట్ బుక్ చేసుకోవడం, జాయింట్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఇంటికే పాసు బుక్కు వచ్చేస్తున్నది. కానీ నిజానికి రికార్డుల్లో ఆ భూమి ఉందా? లేదా? అన్న విచారణ జరగడం లేదు. ఇలా భూమే లేకుండా క్రయ విక్రయాలకు ఆస్కారం ఏర్పడుతున్నది. దీంతో కొందరు అక్రమంగా పట్టా పొందిన వారి నుంచి కొనుగోలు చేయడం.. పొషెషన్ లో ఉన్న వారితో గొడవకు దిగడం కామన్ గా మారింది. రిజిస్ట్రేషన్ సమయంలో భూమి హక్కుదారుడికి ఆ విషయం తెలిసినా.. నిలిపేయించే అధికారం లేదు. రికార్డుల్లో ఉన్న వ్యక్తి స్లాట్ బుక్ చేసుకున్నాడంటే.. ఆ రిజిస్ట్రేషన్/మ్యుటేషన్ ఆపడం ఎవరి వల్లా కాదు. ఆ అధికారం తహసీల్దార్ కు కూడా లేకుండా ధరణి పోర్టల్ చేసేసింది. అలాగే ఆటోమెటిక్ సక్సెషన్, నాలా కన్వర్షన్ వంటి సదుపాయాలతో అసలుకే మోసం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు భూమాతలో ఆటోమెటిక్ మ్యుటేషన్ పై ధరణి కమిటీ ఎలాంటి సిఫారసు చేస్తుందోననేది ఆసక్తికరంగా మారింది.


Next Story

Most Viewed