MP పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తా.. మల్లు రవి సంచలన సవాల్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఫెయిల్ అయిందని, కేసీఆర్ మాట్లాడిన విధానం చూస్తేనే సభ ఫెయిల్ అయిందని అని అర్థమయిందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు.

MP పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తా.. మల్లు రవి సంచలన సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఫెయిల్ అయిందని, కేసీఆర్ మాట్లాడిన విధానం చూస్తేనే సభ ఫెయిల్ అయిందని అని అర్థమయిందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అధికార కాంగ్రెస్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ డాక్టర్​మల్లు రవి ధీటుగా బదులిచ్చారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ స్పీచ్‌కు ఎవరు రెస్పాన్స్ కాలేదని, వాహనాలు పెట్టి, డబ్బులు పంపిణీ చేయడం ద్వారా సమావేశానికి వచ్చారు తప్ప కేసీఆర్ కోసం రాలేదన్నారు. కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు చేసినా ఆ ప్రాజెక్టు కుంగి పోయిందని, లక్ష కోట్లు గోదావరిలో పోసి ప్రజా ధనాన్ని కేసీఆర్ వృథా చేశారని విమర్శించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తి అయ్యాయని కేసీఆర్ చెబుతున్నారు.. ఆయా పనులు 20 శాతం కూడా కేసీఆర్ ప్రభుత్వం చేయలేదని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయిందని నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. అలాగే, ముక్కు నేలకు రాస్తానని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ అన్నీ అబద్ధపు మాటలు చెప్పారని, తన పాలనలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. కేజీ టూ పీజీ, అందరికీ ఉద్యోగాలన్నారు, కానీ కేసీఆర్ చేసింది ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ ఫథకాలు గడపగడపకూ చేరుతున్నాయని, వాటితో ప్రజలకు సంతృప్తికరంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబంలో కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, గతంలో అల్లుడు మంత్రి, కూతురు ఎమ్మెల్సీ, ఇంకొకరు ఎంపీ ఇలా వారి కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలొచ్చాయన్నారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురిచి మాట్లాడే స్థాయి కేసీఆర్‌ది కాదన్నారు.

ఏఐసీసీ అగ్రనేత సోనియగాంధీ తెలంగాణ ఇవ్వటం వల్లనే కేసీఆర్ కుటుంబం నేడు ఖరీదైన కార్లలో తిరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ దరిద్రపు, దుష్టపాలన గురించి ప్రజలు మరిచిపోయారని అనుకున్నారేమో? కానీ ఎప్పటికీ మర్చిపోరని డా.మల్లు రవి అన్నారు. కేసీఆర్‌లో అహంకారం ఏమాత్రం తగ్గలేదని అసెంబ్లీ సమావేశాల పట్ల కూడా లెక్కలేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నిన్నటి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తప్ప ఇంకెవ్వరూ వేదిక‌మీద మాట్లాడలేదని, ఇతరులెవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదా లేక వారెవరికీ ఆ సామర్థ్యం లేదా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరి మాట వినలేదని, ఇప్పుడు కూడా వినే స్థితిలో లేరు అంటూ కేసీఆర్‌పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి సొంత ఇంట్లోనే ఉంటూ నిరంతరం సెక్రటేరియట్‌కు వస్తూ పాలన సాగిస్తున్నారని చెప్పారు. మంత్రులు సైతం ఎల్లవేళలా సచివాలయంలో మంత్రులకు అందుబాటులో ఉంటున్నారన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సెక్రటేరియట్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించకుంటున్నారని మల్లు రవి స్పష్టం చేశారు.

Next Story