మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్!.. నాయకుల మీటింగ్ లో ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి?

by Disha Web Desk 13 |
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్!..  నాయకుల మీటింగ్ లో ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్నా అందరి దృష్టి మాత్రం మల్కాజిగిరి సెగ్మెంట్ పైనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ స్థానం కావడంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఎలాగైనా ఈ సెగ్మెంట్ లో తమ జెండా పాతేందుకు బీజేపీ, బీఆర్ఎస్ లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాల్గాజిగిరి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

మల్కాజిగిరితో పాటు కంటోన్మెంట్ మన ఖాతాలోకే రావాలి:

గత అసెంబ్లీ ఎన్నిక్లలో తెలంగాణ రాష్ట్రమంతాటా తుఫాను వచ్చినట్లు కాంగ్రెస్ గెలిచినా మల్కాజిగిరి పార్లమెంట్ లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని ఈ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదని సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అందుకే ఈసారి మల్కాజిగిరి పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలని అందుకోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. తానిప్పుడు సీఎంగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలదేనని ఆనాడు కొంత మంది నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు. 2,964 బూత్ లలో ప్రతి బూత్ లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేశారని, నాటి మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైందని వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు ఈ మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదన్నారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసునుకున్నామని మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రమంతా మల్కాజిగిరి క్యాంపెయిన్ మోడల్:

మల్కాజిగిరిలో అనుసరించే క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతటా అనుసరించేలా నిర్వహించాలని నాయకులకు సీఎం సూచించారు. హొలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందన్న రేవంత్ రెడ్డి.. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకుని వారికి పోలింగ్ బూత్ ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలన్నారు. రేపు సాయంత్రం కంటోన్మెంట్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవాలని, ప్రతిరోజు ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాల్సిందేనని ఆదేశించారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదని, ముఖ్యమంత్రిది అని అందువల్ల ప్రణాళికబద్దంగా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలే నా బలం.. నా బలగం అన్న రేవంత్ రెడ్డి మనకు బలమైన నాయకత్వం ఉంది.. సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు.

మల్కాజిగిరి అభ్యర్థి ఖరారు?:

మల్కాజిగిరి కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కబోతున్నది అనేది చర్చనీయాశంగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జరిగిన నాయకుల భేటీ కార్యక్రమంలో సీఎంతో పాటు పట్నం సునీతా మహేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖాయం అయిందనే చర్చ నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది.


Next Story

Most Viewed