మల్కాజ్‌గిరి ఈటలకే..! జాతీయ నాయకత్వం ఫిక్స్!

by Disha Web Desk 14 |
మల్కాజ్‌గిరి ఈటలకే..! జాతీయ నాయకత్వం ఫిక్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సీటు ఈటల రాజేందర్‌కు అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని హై కమాండ్ చెప్పినట్లు సమాచారం. దీంతో మేడ్చల్ జిల్లాలోని ఈటల రాజేందర్ ఇంటి వద్దకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అధికారికంగా పార్టీ నుంచి ప్రకటన రానప్పటికీ, ఈటల రాజేందర్ అభిమానులు, పార్టీ శ్రేణులు మాత్రం ఈటలకు టికెట్ ఖాయమని, భారీ మెజారిటీతో గెలుపు తథ్యమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ ఆశించిన నేతలు వీరే

ఈటల రాజేందర్ కూడా మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడే మొదటి నుంచే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీలో ఇతర నేతలు కూడా పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేయాలని భావించి.. రకాల కార్యక్రమాలు కూడా చేశారు. బీజేపీ నేతలు మురళీధర్‌రావు, చాడ సురేశ్‌రెడ్డి, మల్క కొమురయ్య లాంటి పలువురు సీనియర్ నేతలు టికెట్ ఆశించారు. వీళ్లందరూ ఇప్పటికే ప్రచారం సైతం మొదలుపెట్టారు. కానీ ఆ స్థానం టికెట్ ఈటలకే ఇవ్వనున్నట్లు జాతీయ నాయకత్వం ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది.

100 మందితో తొలి జాబితా

కాగా, ఇండియా కూటమిని ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవకుండా బీజేపీ పావులు కదుపుతోంది. ఎంపీ అభ్యర్థుల విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దాదాపు 100 మందితో తొలి జాబితా విడుదల కానున్నట్లు తెలిసింది. ఇందులో తెలంగాణ నుంచి 12 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే అధిష్టానం రేపో, ఎల్లుండో అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే మల్కాజ్‌గిరి టికెట్ ఈటల రాజేందర్‌కే వస్తున్నదని సమాచారం. ఈ క్రమంలోనే శామీర్‌పేట్‌లోని ఈటల నివాసంలో ఈ ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి హాజరు కావాలని పార్టీ కార్యకర్తలకు మెసేజ్‌లు పంపారు.

దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్

దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయిన మల్కాజ్‌గిరి సీట్ బీజేపీకి హాట్ సీట్‌గా మారింది. ఎందుకంటే ఇక్కడ ఉత్తరాది ప్రభావం ఎక్కువ, దీంతో కచ్చితంగా మోడీ మంత్ర పని చేస్తుందని బీజేపీ నేతలు భావించారు. దీంతో ఈ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ పెరిగింది.


Next Story

Most Viewed