నామ మాత్రపు వేతనాలతో శ్రమ దోపిడీ ఆపాలి.. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షా ఉద్యోగుల మహాధర్నా

by Ramesh Naini |

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యల పరిష్కారించాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది.

నామ మాత్రపు వేతనాలతో శ్రమ దోపిడీ ఆపాలి.. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షా ఉద్యోగుల మహాధర్నా
X

దిశ, తెలంగాణ బ్యూరో: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యల పరిష్కారించాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో మహా ధర్నా నిర్వహించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ధర్నాకు అధ్యక్షత వహించారు. సీపీఐ శాసన సభా పక్ష నాయకులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షా ఉద్యోగులకు నామ మాత్రపు వేతనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మాజీ శాసన మండలి సభ్యుడు కె నాగేశ్వర్ మాట్లాడుతూ, గత ఇరవై సంవత్సరాలుగా తాను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో పోరాటాల్లో పాల్గొంటున్నానని, పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడటం అలవాటుగా మారిందని విమర్శించారు. జాతీయ మహిళా ఉపాధ్యాయ నాయకులు ఎం సంయుక్త మాట్లాడుతూ, సెలవుల విషయంలో రెగ్యులర్, కాంట్రాక్టు వివక్ష సమంజసం కాదన్నారు.

చావ రవి మాట్లాడుతూ, తెలంగాణ తొలి పిఆర్సీ సిఫారసు చేసిన విధంగా కాంట్రాక్టు ఉద్యోగులకు రూ 1000 వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ ఉద్యోగులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వేతనాలు ఇస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంలో ఈ వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దేశవ్యాప్తంగా ఒకే రకమైన వేతనాలు అమలు చేయాలని, అందుకు అవసరమైన అదనపు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ వెంటనే చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గా భవాని, వేలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

Next Story