- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదాల నివారణపై యువతకు అవగాహన ఉండాలి : ఎస్పీ జానకి
ప్రమాదాల నివారణకు యువతలో సరియైన అవగాహన కలిగి ఉన్నప్పుడే, ప్రమాదాలు గణనీయంగా తగ్గి సమాజం సురక్షిత దిశగా సాగుతుందని ఎస్పీ జానకి అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రమాదాల నివారణకు యువతలో సరియైన అవగాహన కలిగి ఉన్నప్పుడే, ప్రమాదాలు గణనీయంగా తగ్గి సమాజం సురక్షిత దిశగా సాగుతుందని ఎస్పీ జానకి అన్నారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తలపెట్టిన 'అరైవ్ అలైవ్' అనే రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం సందర్భంగా శనివారం స్థానిక వాసవి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 'డిఫెన్స్ డ్రైవ్' అనేది ప్రమాదాలను ముందుగానే ఊహించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడమని ఆమె తెలిపారు. డ్రైవింగ్ సమయంలో చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించడం, ఇతరుల తప్పిదాలను ముందుగానే అంచనా వేయడం, వేగాన్ని నియంత్రణలో ఉంచడం, సురక్షిత దూరాన్ని పాటించడం వంటి అలవాట్లు ప్రాణాలను కాపాడుతాయని ఎస్పీ వివరించారు. మొబైల్ ఫోన్ వినియోగం, అలసట, నిద్రలేమి స్థితిలో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు, అలాగే వెనక కూర్చున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి అలవాట్లను యువత మానుకొని, పై నియమాలన్నీ పాటిస్తూ ప్రమాదరహిత ప్రయాణాన్ని సాగించాలని ఎస్పీ జానకి హితవు పలికారు.
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
'అరైవ్ అలైవ్' కార్యక్రమం సందర్భంగా స్థానిక విజన్ గార్డెన్ లో డ్రైవర్లకు నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని ఎస్పీ జానకి ప్రారంభించి మాట్లాడారు. డ్రైవర్లకు మంచి చూపు ఉండటం రోడ్డు భద్రతలో అత్యంత కీలకమని, కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఎదుటి వాహనాలు, అడ్డంకులు ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. డ్రైవర్లందరూ నిరంతరం నిబంధనల మేరకు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం డ్రైవర్ల భద్రత, ప్రయాణికుల రక్షణ కోసం అనేక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, టూ టవున్ సీఐ ఇజాజొద్ధీన్, ట్రాఫిక్ సీఐ రాజేందర్ రెడ్డి, ఉమెన్స్ పీఎస్ సీఐ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ కొండా స్వామి, అకాడమీ డైరెక్టర్ రజనీకాంత్, కరస్పాండెంట్ శ్రీనివాసయ్య, షీ టీం, ఐటీ కోర్ సభ్యులు, ఎస్ఐ రవి పాల్గొన్నారు.






