స్థానిక పోరుకు యువత సై

by velandi.Saikiran |

స్థానిక సంస్థల రిజర్వేషన్ ఖరారు కావడం.. వెనువెంటనే ఎన్నికల షెడ్డుల్

స్థానిక పోరుకు యువత సై
X

దిశ, కొడంగల్ : స్థానిక సంస్థల రిజర్వేషన్ ఖరారు కావడం.. వెనువెంటనే ఎన్నికల షెడ్డుల్ వెలువడంతో గ్రామాల్లో వాతావరణం ఒక్క సారిగా మారింది. దసరా హడావిడిలో ఉన్నవారంతా స్థానిక ఎన్నికలపై దృష్టి సారించారు. కొడంగల్ మండల కేంద్రంలో రాజకీయ వేడి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి నోట ఎన్నికల మాటే వినిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఎంతో నిరీక్షణ తరువాత..

గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం చాలా కిందటే ముగిసింది. చాలా కాలం నుంచి ఈ ఎన్నికల నోటిఫికేషన్ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎంతో నిరీక్షణ తరువాత ఎట్టకేలకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో అభ్యర్థులంతా అలెర్ట్ అయ్యారు. ఎత్తులకు పైఎత్తులు వేసే విధంగా ఓటర్ దేవుళ్లను, బడా నాయకుల ఆశీర్వాదాలు ఎలా అందుకోవాలనే సమాలోచనలో ఆశావాహులు నిమగ్నమయ్యారు. ఒకపక్క దసరా పండుగ హడావిడి మరోపక్క ఎన్నికల హడావిడితో గ్రామాల లో గత రెండు మూడు రోజులుగా ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు కొందరిని నిరాశ పర్చగా.. మరి కొందరికి కొత్త ఆశలు రేకెత్తించాయి.

పోటీకి యువత రెడీ..

ఈ సారి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొడంగల్ లో యువత ఆసక్తి చూపుతున్నారు. దీంతో రాజకీయ పార్టీలు కూడా యువతలో నుంచే గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పడ్డాయి. ఎంపీపీ పదవికి ఉన్న ఎంపీటీసీ స్థానాలపై ఆచితూచి అభ్యర్థులను గుర్తించే విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎంపీపీ మండలంలో ప్రధానమైన పదవి కావడంతో అన్ని విధాలుగా అర్హత ఉన్న అభ్యర్థులను ఆయా పార్టీలు అన్వేషిస్తున్నాయి. కొడంగల్ మండలంలో మండల ఎంపీపీ జనరల్ ఉమన్ గా రిజర్వేషన్ కాగా జెడ్పీటీసీ అన్ రిజర్వ్ జనరల్ గా రిజర్వేషన్లు అయినాయి. మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో భాగంగా బీసీ ఉమెన్ లకు రెండు బీసీ జనరల్ 3, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ ఉమెన్ ఒకటి, ఎస్టీ జనరల్ ఒకటి, అన్ రిజర్వ్ జనరల్ గా రెండు ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేశారు. కొడంగల్ మండలంలో మొత్తం 25 గ్రామపంచాయతీ ఉన్నాయి. 25 గ్రామాలు, 222 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 32,205. పురుషులు15,782, మహిళలు16,423 ఉన్నారు. ఎన్నికల బరిలో నిలిచి తమ సత్తా చాటుకోవాలని మండల యువత ఎదురు చూస్తున్నారు.

Next Story