వచ్చే ఎన్నికల్లో పేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్ దేనా...?

by Disha Web Desk 23 |
వచ్చే ఎన్నికల్లో పేట మున్సిపల్ పీఠం  కాంగ్రెస్ దేనా...?
X

దిశ,నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా ఏర్పాటు కాకముందు నారాయణపేట ఒక్కటే మున్సిపాలిటీగా ఉండేది. జిల్లా ఏర్పాటు తర్వాత మక్తల్, కోస్గి మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు ఉండగా కోస్గి, మక్తల్ లో టౌన్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలను కలిపి 16 వార్డులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వారు ఉండడంతో మున్సిపల్ పీఠాలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేది. కానీ ప్రస్తుతం మూడు నియోజకవర్గాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సొంతం కావడంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సైతం మూడు మున్సిపాలిటీలు హస్తగతం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణతో ముందుకు సాగుతుంది.

నారాయణపేట జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం నారాయణపేట మున్సిపాలిటీ ప్రస్తుతం (బీఆర్ఎస్), కోస్గి (కాంగ్రెస్), మక్తల్ (బీజేపీ) చేతిలో ఉంది. కోస్గిలో ఈ మధ్యనే అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని మూడు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేలా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బలమైన కౌన్సిలర్ అభ్యర్థులను బరిలో నిలిపి హస్తం సొంతం చేసుకునేలా ముందుకు సాగుతున్నారు.

ఈ సారి పేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్ దే...?

రాష్ట్రంలో ఏ ప్రాంతంలో మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ కైవసం చేసుకున్న నారాయణపేట మున్సిపాలిటీ మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీని కైవసం చేసుకునేలా గతంలో ఉండేది. కాగా గతంలో నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీ హస్తగతం నుంచి స్వల్ప (ఒక్క కౌన్సిలర్) సీటు తగ్గడంతో చివరి నిమిషంలో బీఆర్ఎస్ సొంతమైంది. కానీ ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్...నారాయణపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి కంచుకోటలో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే కొంతమంది కౌన్సిలర్లు హస్తం పార్టీలో చేరి అవిశ్వాస తీర్మానం పెడదామని భావించిన మున్సిపల్ ఎన్నికలకు పెద్దగా గ్యాప్ లేకపోవడంతో ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని సైలెంట్ అయినట్లు తెలుస్తుంది.


Next Story

Most Viewed