మిగతా ఆ నలుగురు ఎవరు..?

by Ratna Kumari |

దిశ దినపత్రికలో "కాంగ్రెస్ నాయకుడిపై రౌడీ షీట్ మరో నలుగురిపై కూడా" అని ప్రచురితమైన వార్తా కథనం సంచలనంగా మారింది. ఆ మిగతా నలుగురు ఎవరు అనే ఉత్కంఠ మండల ప్రజల్లో నెలకొంది.

మిగతా ఆ నలుగురు ఎవరు..?
X

దిశ, నవాబుపేట : దిశ దినపత్రికలో "కాంగ్రెస్ నాయకుడిపై రౌడీ షీట్ మరో నలుగురిపై కూడా" అని ప్రచురితమైన వార్తా కథనం సంచలనంగా మారింది. ఆ మిగతా నలుగురు ఎవరు అనే ఉత్కంఠ మండల ప్రజల్లో నెలకొంది. ఈ వార్త కథనం ద్వారా కేవలం టీపీసీసీ కో ఆర్డినేటర్ ధారా భాస్కర్ పేరు మాత్రమే బహిర్గతం కావడం మిగతా నలుగురి పేర్లు బహిర్గతం కాకపోవడంతో ఇప్పటివరకు నవాబుపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఆ నలుగురి వివరాలు తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ నలుగురిలో ఒకరు తామే అయి ఉంటామేమోనని వారు భయపడుతున్నారు. మిగతా నలుగురి వివరాలు సీఐ వెల్లడించకపోవడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ మిగతా నలుగురి వివరాలను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. దాని వల్ల వారి వివరాలను తెలుసుకోవడానికి ఇప్పటి వరకు స్టేషన్ లో తమపై కేసులు నమోదు అయినవారు, వారి సంబంధీకులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నేరస్తులపై నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిశీలిస్తున్నామని, రౌడీ షీట్ నమోదు ప్రక్రియ పూర్తి కాలేదని అందువల్ల వారి పేర్లు ఇప్పుడే బయటకు వెల్లడించలేమని పోలీస్ అధికారులు మెలిక పెడుతున్నారు.

కేసుల్లో ఇరుక్కున్న వారు మాత్రం ఎవరికి వారే రౌడీ షీట్ ఓపెన్ పై, దానివల్ల చేకూరే దుష్పరిణామాలపై ఊహించుకుంటూ లోలోన తీవ్రంగా మదన పడుతున్నారు. అంతేకాక తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో మండల ప్రజల్లో ఆ నలుగురు ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. కాగా జడ్చర్లలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించబోయి అరెస్ట్ అయిన ధారా భాస్కర్ మాత్రం తన అరెస్టును గొప్పగా చెప్పుకుంటూ ఉండడం విశేషం. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో భాగంగా అరెస్టు కావడం తనకు గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొనడం వెనుక మతలబు ఏంటో ఎవరికి కూడా అర్థం కావడం లేదు. తనపై ఎన్ని కేసులు నమోదైన తాను భయపడనని, ఇంతటితో అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటాన్ని ఆపబోనని, అవి అన్నీ కూడా తన ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొనడం చూస్తుంటే ఆయన తన వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకోవడానికి ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story