ధన్వాడ రోడ్లపై టిప్పర్ల దడ!

by Pulgam srinivas |

ప్రస్తుతం ధన్వాడ చెరువు పరిసర ప్రాంతాలు, ఇక్కడి రోడ్లను చూస్తుంటే.. ఇది ధన్వాడ గ్రామామా లేక కర్ణాటకలోని మైనింగ్ ప్రాంతమైన బళ్లారినా అనే అనుమానం కలుగుతుంది.

ధన్వాడ రోడ్లపై టిప్పర్ల దడ!
X

దిశ,ధన్వాడ: తెల్లారిందంటే చాలు ధన్వాడ రహదారిపై టిప్పర్ల హోరెత్తుతోంది. ఉదయం ఆరు గంటలు కాకముందే రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్తున్న టిప్పర్లు గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ధన్వాడ పెద్దచెరువు నుంచి గత కొన్ని రోజులుగా నల్లమట్టి తరలింపు కొనసాగుతున్నా, నియంత్రణ చర్యలు కనిపించకపోవడంతో ప్రమాద భయం వెంటాడుతోంది.

బళ్లారిని తలపిస్తున్న దృశ్యాలు!

ప్రస్తుతం ధన్వాడ చెరువు పరిసర ప్రాంతాలు, ఇక్కడి రోడ్లను చూస్తుంటే.. ఇది ధన్వాడ గ్రామామా లేక కర్ణాటకలోని మైనింగ్ ప్రాంతమైన బళ్లారినా అనే అనుమానం కలుగుతుంది. వందలాది టిప్పర్లు ఒకదాని వెనుక ఒకటి పోటీ పడుతూ దూసుకెళ్తున్నాయి. ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న ఈ వాహనాల నుంచి భారీ మట్టి పెడ్డలు రోడ్డుపై పడుతుండటంతో ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారు. రోడ్డు దాటడానికి కనీసం అవకాశం లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

మంత్రి కాన్వాయే ఆగాల్సి వచ్చింది..

ఈ టిప్పర్ల బీభత్సం సామాన్యులనే కాదు.. ఏకంగా రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్‌లను కూడా వదల్లేదు. మూడు రోజుల క్రితం మంత్రి వాకిటి శ్రీహరి తన కాన్వాయ్‌తో ధన్వాడ మీదుగా నారాయణపేట వెళ్తుండగా, వరుసగా వచ్చిన టిప్పర్ల వల్ల రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ల ధాటికి మంత్రి కాన్వాయ్‌తో పాటు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల వాహనాలు సైతం కొద్దిసేపు రోడ్డుపైనే నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీఐపీల పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్య జనం పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

తప్పిన పెద్ద ప్రమాదం.. మాజీ డైరెక్టర్ బైఠాయింపు

వారం రోజుల క్రితం మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ రామచంద్రయ్య ముదిరాజ్ రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వెళ్తున్న టిప్పర్ నుంచి ఒక్కసారిగా మట్టిపెడ్డలు ఆయనపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గుత్తేదారుల నిర్లక్ష్యానికి నిరసనగా రామచంద్రయ్య రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేయడంతో కొద్దిసేపు టిప్పర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

చలించని అధికారులు.. అఖిలపక్షం మౌనం!

ఇటీవల మక్తల్‌లో ఇలాగే నల్లమట్టి తరలిస్తున్న ఓ టిప్పర్ కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆ ఘోరకలి కళ్లముందే కదలాడుతున్నా ఇక్కడి అధికారుల్లో చలనం రాకపోవడం గమనార్హం. అఖిలపక్ష నాయకులు మొదట్లో నల్లమట్టి తరలింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలపై కనీసం నోరు మెదపకపోవడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రజలు నిలదీస్తున్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోయాకే స్పందిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే ఉన్నతాధికారులు స్పందించి టిప్పర్ల వేగాన్ని, ఓవర్‌లోడింగ్‌ను నియంత్రించాలని ధన్వాడ ప్రజలు కోరుతున్నారు.

Next Story