చైర్మ‌న్ పీఠం హస్త గతం

by Ratna Kumari |

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అత్యధికంగా 18 సీట్లు సాధించి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నది.

చైర్మ‌న్ పీఠం హస్త గతం
X

దిశ, కందనూల్ : ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అత్యధికంగా 18 సీట్లు సాధించి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉత్కంఠ భరితంగా సాగింది. మొత్తం మూడు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించగా మొత్తంగా 18 మంది కాంగ్రెస్ అభ్యర్థులు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి ఆరు గురు అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. కాగా 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై 3 ఓట్లతో గెలుపొందగా కాంగ్రెస్ అభ్యర్థి రీ కౌంటింగ్ కోరారు. ఓట్లను మళ్ళీ లెక్కించిన అధికారులు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ కొనసాగింది. పలు వార్డుల్లో గట్టి పోటీ నెలకొనగా పోటాపోటీగా ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలో 3, 12, 18 ఓట్ల ఆధిక్యంతోనే ముగ్గురు అభర్ధులు గెలుపొందడంతో ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ ఎలా ఉన్నదో అర్థమవుతోంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో చివరకు కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించినది. గత ఎమ్మెల్యే ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలకమైన కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరగా మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు కూడా కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కొంత బలహీనపడింది. అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండటంతో ఆ ఊపు మున్సిపాలిటీ ఎన్నికల్లో కనిపించినట్లుగా అనిపిస్తున్నది. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉడగానే 9 సీట్లు సాధించగా ఇప్పుడు ఆ సంఖ్య రెండింతలయ్యింది.

గెలుపొందిన అభ్యర్థులు వీరే..

1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అర్జునయ్య 473 ఓట్ల మెజార్టీతో, రెండవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తిమ్మాజీపేట పాండు 82 ఓట్ల మెజార్టీతో, 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గుంపల్లి కవిత 86 ఓట్ల మెజార్టీ, 4వ వార్డులో కాంగ్రస్ అభ్యర్థి వసంత 419 అత్యధిక ఓట్ల మెజార్టీతో, 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నరసింహ రెడ్డి 133 ఓట్లతో, 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మక్కపల్లి శ్రీనివాసులు 80 మెజారిటీతో, 7వ వార్డులో అనంత అలివేలమ్మ 134 ఓట్లతో, 8వ వార్డులో బాదం రమేష్ 307 ఓట్లతో, 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుంకరి అలివేలు 315 మెజార్టీతో, 10వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జయ ప్రకాష్ నారాయణా చారి 50 ఓట్లతో, 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అసిఫా బేగం 148 ఓట్లతో, 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జయలక్ష్మి 3 ఓట్లతో, 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త గంగాధర్ 138 ఓట్లతో, 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నాజిమా బేగం 389 ఓట్లతో, 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌసియా బేగం 307 మెజార్టీ, 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కె.సింధు 12 ఓట్లతో, 17వ వార్డులో పిడికిళ్ల రాజేశ్వరి 84 ఓట్లతో, 18 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రకళ 197 మెజార్టీతో, 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కె.సునీత157 ఓట్లతో, 20వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మమ్మ 18 ఓట్లతో, 21 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పడిగ శంకర్ 48 ఓట్ల మెజార్టీతో, 22వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆవంచ మాధవి 243 ఓట్లతో, 23వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తీగల సునేంద్ర కుమార్ 240 ఓట్లతో, 24వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.డి.నిజామొద్దీన్ 310 ఓట్లతో విజయం సాధించారు. అభ్యర్థులకు అధికారులు గెలుపు పత్రాలు అందజేశారు.

Next Story