బీఆర్ఎస్ నేతల తీరు సరైంది కాదు : ఎంపీ డాక్టర్ మల్లు రవి

by Ratna Kumari |

దిశ, కందనూల్ : బీఆర్ఎస్ నేతల తీరు సరైంది కాదని నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్ర

బీఆర్ఎస్ నేతల తీరు సరైంది కాదు :  ఎంపీ డాక్టర్ మల్లు రవి
X

దిశ, కందనూల్ : బీఆర్ఎస్ నేతల తీరు సరైంది కాదని నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి వ్యాఖ్యానించారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బీఆర్ఎస్ నేతల తీరును తీవ్రంగా ఖండించారు. రాజకీయాలు హుందాగా నడవాల్సిన అవసరం ఉందన్నారు. తాము చెప్పినట్లే రాజకీయాలు ఉండాలని, లేకపోతే ఇష్టమున్నట్టు మాట్లాడుతామన్న ధోరణితో బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇది రాజకీయాల్లో మంచి పరిణామం కాదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్, కేసీఆర్ఇ ష్టమున్నట్టు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బాధ్యత గల ప్రజా సేవకుడిగా ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ కేటీఆర్ అనేక బహిరంగ సభలలో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కు సమాజంలో పెద్ద బాధ్యత ఉందని, కానీ ఆ బాధ్యతను వదిలేసి తిట్ల పురాణం ఎత్తుకున్నారన్నారు. కేటీఆర్ లాంటి అవగాహన లేని వారికి హుందాతనం నేర్పించాలని, రాజకీయాలపై అనుభవం ఉన్న హరీష్ రావుకు సూచించారు. ఇటీవలి కాలంలో హరీష్ రావు కూడా నోరు జారుతున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండి పాలన చేసిన బీఆర్ఎస్ ను కాదని.. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని, ప్రజల తీర్పును గౌరవిస్తూ ముందుకు నడవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తున్నామని తెలిపారు. హుందాగా రాజకీయాలు చేస్తూ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఫ్రస్టేషన్ తో నోటికొచ్చినట్టు మాట్లాడటం ప్రజలు సహించరని హెచ్చరించారు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని తన అనుభవంతో రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేసే మార్గాలపై చర్చించాలని సూచించారు. సమస్యలపై చర్చే ప్రజాస్వామ్యమని, నోటికి పని చెప్పడం ప్రజాస్వామ్యం కాదని డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు.

Next Story