రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి: కలెక్టర్ కోయ శ్రీహర్ష

by Disha Web Desk 11 |
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: నారాయణపేట జిల్లాలోని జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, మున్సిపాలిటీల పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమన్వయ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2014 నుంచి 2022 వరకు నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 650 మంది ప్రాణాలు కోల్పోయారని, 1205 మంది గాయాల పాలైనారన్నారు. కృష్ణ, మాగనూరు, మక్తల్ ఏరియాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉందని, దీనిని తక్షణమే అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పోలీస్ శాఖ, రోడ్ల భవనాలు, జాతీయ రహదారులు, మున్సిపల్ కమిషనర్లు సంయుక్తంగా రోడ్లను పర్యవేక్షించి అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, సైన్ బోర్డులు, రేడియం సూచికలు ఇరుకైన వంతెనల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటివి నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్లపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శక్తి నగర్ నుంచి డస్ట్ లోడ్ తో నింపిన భారీ వాహనాలు వస్తున్నాయని వాటిలో అధిక లోడ్ తో లేకుండా పైన కవర్ కప్పేసి ఉండే విధంగా చూడాలని ఆర్టీవో ను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో జాతీయ రహదారి ఆర్ అండ్ బీ రోడ్లు ఉన్నాయని వీటిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి పెనాల్టీలు వేయడం జరుగుతుందన్నారు. రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించక పోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు ఇక నుంచి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, డా. రాంమనోహర్, ఆర్ అండ్ బీ ఈఈ కేవీఎన్ స్వామి, డీఈ రాములు, జాతీయ రహదారుల డీఈ. రమేష్, డీఎస్పీ సత్యనారాయణ, ఈఈ పి.ఆర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed