- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధన్వాడ ఎస్సీ హాస్టల్ పనులేవి?
ధన్వాడ ఎస్సీ హాస్టల్ మరమ్మతు పనులు పాలకుల హామీలకే పరిమితమయ్యాయి

ధన్వాడ ఎస్సీ హాస్టల్ పనులేవి?
మాటలే తప్ప మంజూరు కాని నిధులు!
శిథిలావస్థలో భవనం..
ముక్కు మూసుకునేలా ఉన్న బాత్రూంలు
స్కూళ్లు తెరిచేందుకు నెల రోజులే గడువు..
ఒక్క అడుగు ముందుకు పడని వైనం
ధన్వాడ ఎస్సీ హాస్టల్ మరమ్మతు పనులు పాలకుల హామీలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర చైర్‌పర్సన్, జిల్లా కలెక్టర్ సందర్శించినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరి విద్యార్థులకు నివాసం యోగ్యంగా లేదు. బాత్రూంలు అపరిశుభ్రంగా మారి రోగాలకు నిలయాలుగా తయారయ్యాయి. స్కూళ్లు తెరిచేందుకు నెల రోజులే సమయం ఉన్నా నిధులు మంజూరు కాలేదు. వేసవి సెలవుల్లోనే పనులు పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో చేసిన అరకొర పనుల వల్ల ప్రభుత్వ ధనం వృధా అయిందని విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
దిశ, ధన్వాడ : ధన్వాడలోని ఎస్సీ హాస్టల్ పరిస్థితిని చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ‘వామ్మో.. ఇది హాస్టలేనా?’ అంటూ ఇటీవల తనిఖీకి వచ్చిన రాష్ట్ర బాలల హక్కుల చైర్‌పర్సన్ సీతాదయాకర్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారంటే ఇక్కడి దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే నిధులు మంజూరు చేయించి హాస్టల్‌ను బాగు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆమె వచ్చిన వారం రోజులకే అప్పటి జిల్లా కలెక్టర్ ప్రీతిక్ జైన్ కూడా హాస్టల్‌ను సందర్శించారు. వేసవి సెలవులు ముగిసేలోపు మరమ్మతులు పూర్తి చేయిస్తామని చెప్పారు. కానీ, కలెక్టర్ బదిలీ కావడంతో ఆ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి.
మూరెడు పనులు లేవు.. నిధుల ఊసే లేదు!
నూతన భవనం సంగతి దేవుడెరుగు.. కనీసం ఉన్న భవనానికి మరమ్మతులు చేసేందుకు కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి నిధులు మంజూరు కాలేదు. స్కూళ్లు పునఃప్రారంభం కావడానికి ఇంకా నెల రోజులే సమయం ఉంది. ప్రస్తుతం ఎండాకాలం సెలవులు నడుస్తున్నందున ఇదే సరైన సమయమని అందరూ భావించినా, అధికారుల్లో మాత్రం చలనం లేదు. హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. బాత్రూంల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అవి బాత్రూంలా లేక బందెల దొడ్లా అనేలా తయారయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమాలకు తావు లేకుండా పనులు జరగాలి...
గతంలో తాత్కాలిక మరమ్మతుల పేరుతో కొన్ని నిధులు మంజూరు చేసినప్పటికీ గుత్తేదారులు తూతూమంత్రంగా పనులు చేసి ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ హాస్టల్‌లో మక్తల్, ఉట్కూరు, మాగనూరు, కృష్ణ మండలాలతోపాటు నారాయణపేట జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. కేవలం తనిఖీలు చేసి వెళ్లిపోవడం కాకుండా, యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి హాస్టల్‌ను సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు.
వేసవి సెలవులు ముగిసేలోపు బాగు చేయాలి
ఇప్పటికే సగం వేసవి సెలవులు ముగిశాయి. కానీ ఎలాంటి మరమ్మతులు ప్రారంభం కాలేదు. నిధులు మంజూరు చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేయాలి. అధికారులు కేవలం రావడం.. చూడడం.. వెళ్లడం కాదు. నిధులు ఇస్తేనే విద్యార్థుల ఇబ్బందులు తీరుతాయి.
- జడల బాలరాజ్, ధన్వాడ






