ఆస్తికోసం క‌న్న‌తండ్రిపై దాడి చేసిన కొడుకు

by Ratna Kumari |

తల్లిదండ్రులు జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని పిల్లల భవిష్యత్తు కోసం పంచిపెడతారు. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటారనే ఆశతో పెంచిన పిల్లలే చివరకు తమ పై చేయి చేసుకుంటే ఆ తల్లిదండ్రుల గుండె ఎంతగా ముక్కలవుతుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

ఆస్తికోసం క‌న్న‌తండ్రిపై దాడి చేసిన కొడుకు
X

దిశ, నవాబుపేట : తల్లిదండ్రులు జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని పిల్లల భవిష్యత్తు కోసం పంచిపెడతారు. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటారనే ఆశతో పెంచిన పిల్లలే చివరకు తమ పై చేయి చేసుకుంటే ఆ తల్లిదండ్రుల గుండె ఎంతగా ముక్కలవుతుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఆస్తి కోసం కన్న తండ్రి పైనే కొడుకు దాడికి దిగిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు పోకల కృష్ణయ్య తన జీవితకాల సంపాదనను ఇద్దరు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు. పిల్లలు సుఖంగా ఉండాలని భావించిన ఆ తండ్రికి, వృద్ధాప్యంలో ప్రేమాభిమానాలు దక్కాల్సిన సమయంలో చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో నివాసముంటున్న పెద్ద కుమారుడు లక్ష్మణ్ కుమార్ తన భార్య సరస్వతితో, ఓ స్నేహితుడితో కలిసి ఇంటికి వచ్చి గొడవకు దిగినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇంట్లోకి దూసుకొచ్చిన తన కుమారుడు తనపై దాడి చేశారని కృష్ణయ్య వాపోయాడు. బెల్టుతో విచక్షణారహితంగా కొట్టడంతో తనకు తీవ్ర గాయాలయ్యాయని, వృద్ధాప్యంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎన్నడూ ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. "నిన్ను ఎన్నటికైనా చంపేస్తా" అంటూ బెదిరింపులకు కూడా పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడి సమయంలో వృద్ధుడు సహాయం కోసం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగెత్తుకుంటూ వచ్చి ఆయనను రక్షించినట్లు సమాచారం. లేకపోతే పరిస్థితి మరింత విషమించేదని స్థానికులు చెప్పారు. కన్న కొడుకే కసాయిగా మారి తండ్రిపై దాడి చేయడం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. "ఆస్తి ఇచ్చిన తండ్రికే ఈ పరిస్థితి వస్తే సమాజం ఎటు వెళ్తోంది?" అంటూ ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులపై పెరుగుతున్న దాడులు, కుటుంబ బంధాలు క్షీణిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితుడు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై జనార్ధన్ తెలిపారు.

Next Story