జోగులాంబ ఆలయ అభివృద్ధిపై సమీక్ష

by Naveena |

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రఖ్యాత జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం సమీక్ష నిర్వహించారు.

జోగులాంబ ఆలయ అభివృద్ధిపై సమీక్ష
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రఖ్యాత జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం సమీక్ష నిర్వహించారు. మంగళవారం ప్రజాభవన్ లో జరిగిన ఈ భేటీలో జోగులాంబ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికపై చిన్నారెడ్డి, అజయ్ కల్లం చర్చించారు. కొన్నేళ్ల క్రితం మహబూబ్ నగర్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన సందర్బంగా అజయ్ కల్లం జోగులాంబ ఆలయాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు. జోగులాంబ ఆలయ అభివృద్ధిలో ఉన్న అనుభవాన్ని అజయ్ కల్లం పంచుకున్నారు. జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం దేవదాయ, ధర్మాధాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ సహా ఆలయ కమిటీతో ఇప్పటికే రెండు సార్లు సమీక్ష సమావేశాన్ని నిర్భహించినట్లు చిన్నారెడ్డి తెలిపారు.

వచ్చే 20వ తేదీన మరోమారు సమావేశాన్ని నిర్వహించి జోగులాంబ ఆలయ అభివృద్ధి పనులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చిన్నారెడ్డి వివరించారు. సత్వరమే చేపట్టాల్సిన పనుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని చిన్నారెడ్డి పేర్కొన్నారు. తక్షణ పనులలో భాగంగా ఆలయ ప్రాంగణంలో లైటింగ్, పార్కింగ్, ఆలయ చరిత్రతో ప్రచార బోర్డులు పెట్టాలని, అందుకు బస్సు స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేయాలని కమిటీకి ఆదేశించినట్లు చిన్నారెడ్డి తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా బోటింగ్, టూరిజం అభివృద్ధి, అతిథి గృహాల నిర్మాణాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, ఆర్చిల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఈ భేటీలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాఘవరెడ్డి, రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీడ్స్ గ్రోవర్స్ సంఘం అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ కేశవులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story