నడిగడ్డలో పొలిటికల్ హీట్.. ఎంపీ డీకే అరుణ వర్సెస్ ఎమ్మెల్యే బండ్ల

by Ramesh Naini |

నడిగడ్డన రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అని ఎప్పటికప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఐదేళ్లుగా గద్వాల రాజకీయాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

నడిగడ్డలో పొలిటికల్ హీట్.. ఎంపీ డీకే అరుణ వర్సెస్ ఎమ్మెల్యే బండ్ల
X

దిశ, గద్వాల ప్రతినిధి: నడిగడ్డ.. గద్వాల రాజకీయాలు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. శత్రువులుగా ఉన్నవారు మిత్రులు.. మిత్రులుగా ఉన్నవారు శత్రువులు కావడం ఈ ప్రాంతంలో మామూలు అయిపోయింది. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు.. మిగిలిన సమయాలలోనూ నాయకుల మధ్య ఊహించని విధంగా సయోధ్య.. మరికొన్నిసార్లు విభేదాలు భగ్గుమంటూ ఉంటాయి. అసలు ఈ నడిగడ్డన రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అని ఎప్పటికప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఐదేళ్లుగా గద్వాల రాజకీయాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

బండ్ల వర్సెస్ సరిత తిరుపతయ్య :

గతంలో ఒకే పార్టీ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గా సరిత తిరుపతయ్య పనిచేసిన విషయం పాఠకులకు విదితమే. రాజకీయ ఆధిపత్యంలో భాగంగా ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా, సరిత తిరుపతయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడడం.. అనూహ్య రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందడం.. కొన్ని రోజులకే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో పరిస్థితులు మొదటికి వచ్చాయి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరిత తిరుపతయ్య మళ్లీ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ప్రత్యర్థులుగా ఉండిపోయారు. నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్యేక, లేక సరిత తిరుపతయ్యకా అనే అంశంలో అనేక తర్జనభర్జనలు జరిగాయి. చివరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పకనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బండ్ల మాటనే చెల్లుబాటు కావడం.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలవడం.. స్వతంత్రులు, ఎంఐఎం అభ్యర్థులతో కలిసి మునిసిపాలిటీని దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సరిత తిరుపతయ్య మౌనంగా ఉండి పోయారు. మునుముందు జరగబోయే రాజకీయ పరిణామాల కోసం సరితా తిరుపతయ్య ఎదురుచూస్తున్నారు. మరోవైపు నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ కవిత పార్టీలో చేరి ముమ్మరంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

డీకే అరుణ వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిగా, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా బండ్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి డీకే అరుణ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య విభేదాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ డీకే అరుణ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో ఆమె గద్వాల నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించలేదు. ఇటీవల జూరాల ప్రాజెక్టు వద్ద అదనపు బ్రిడ్జి విషయంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆరంభం అయ్యింది. ప్రత్యక్షంగా, పరోక్షంగాను ఎంపీ అరుణ, ఎమ్మెల్యే బండ్ల విమర్శించుకోవడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Next Story