కన్నీరు పెట్టిస్తున్న సాగు కష్టం.. గుండె పగిలేలా రోదిస్తున్న రైతు

by Jakkula.Mamatha |

రెక్కాడితే గానీ డొక్కాడని రైతు బతుకు పై ఎవరో దుండగులు అగ్ని కురిపించారు.

కన్నీరు పెట్టిస్తున్న సాగు కష్టం.. గుండె పగిలేలా రోదిస్తున్న రైతు
X

దిశ,గద్వాల క్రైం/గట్టు: రెక్కాడితే గానీ డొక్కాడని రైతు బతుకు పై ఎవరో దుండగులు అగ్ని కురిపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట, చేతికొచ్చే సమయంలో బూడిద అవ్వడంతో ఆ రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన గట్టు మండలం తప్పెట్లమోర్సు గ్రామంలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే.. తప్పెట్లమోర్సు గ్రామానికి చెందిన వాకిటి వెంకటన్న అనే రైతు తన పొలంలో అలసందలు సాగు చేశారు. పంట కోత అనంతరం, ఆరబెట్టడం కోసం అలసందల రాశిని పొలంలోనే ఉంచారు. అయితే, శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ పంట రాశికి నిప్పంటించారు. నిప్పు సెగలకు సుమారు 20 క్వింటాళ్ల అలసందలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

రూ. 1.50 లక్షల నష్టం.. పుట్టెడు దుఃఖం

మార్కెట్ ధర ప్రకారం ఈ పంట విలువ సుమారు రూ. 1,50,000 ఉంటుందని అంచనా. ఏడాది పొడవునా పడ్డ కష్టం కళ్లముందే బూడిద కావడంతో వెంకటన్న గుండె పగిలినట్టు రోదిస్తున్నారు. "నమ్ముకున్న నేలతల్లి నా కడుపు నింపుతుందనుకుంటే, ఎవరో చేసిన పనికి నా బతుకు ఆగమైంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేము పండించిన పంటను అడవిలోనే దాచుకుంటాం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో మా పంటలకు రక్షణ ఎక్కడ ఉంటుంది?" అని తోటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతులు డిమాండ్

ఈ ఘటనపై స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అమానుషానికి ఒడిగట్టిన నిందితులను వెంటనే గుర్తించి పోలీసులు కఠినంగా శిక్షించాలి. సర్వం కోల్పోయిన రైతు వెంకటన్నను ప్రభుత్వం మానవీయ కోణంలో ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

Next Story